ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం ఎంతకూ సద్దుమణగడం లేదు. ఇటు నాగేశ్వర్, అటు జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ వివాదం ఇక ముగిసినట్టేనని ప్రకటించిన తర్వాత కూడా ఈ వివాదం అంతకంతకూ రచ్చగా మారుతోంది. గురువారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద చోటుచేసుకున్న రచ్చ ఈ వివాదానికి పరాకాష్టగా చెప్పుకోవాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతుగా తెలంగాణ జర్నలిస్టులు రంగంలోకి దిగగా… వారికి వ్యతిరేకంగా తెలంగాణకు చెందిన జనసేన నేత సంపత్ నాయక్ బరిలోకి దిగారు. ఈ సందర్భంగా సంపత్ చేసిన కొన్నిఘాటు వ్యాఖ్యలతో జర్నలిస్టులు ఆయనను చుట్టుముట్టారు. ఫలితంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోగా.. పోలీసుల ఎంట్రీతో సద్దుమణిగింది.
జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవలే తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కాగా… జగన్ ను అరెస్టు చేయాలని పవన్ కోరారని, అందుకు అమిత్ షా ససేమిరా అన్నారని, జగన్ తమకు శాశ్వత మిత్రుడని, చంద్రబాబు మాత్రం పార్ట్ టైం మిత్రుడేనని అమిత్ షా అన్నారని నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలపై జనసేన ఓ రేంజిలో ఫైర్ కాగా… నాగేశ్వర్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. ఆ సందర్భంగా ఆయన బహిరంగంగానే సారీ చెప్పగా… ఈ వివాదాన్ని వదిలేయాలని జన సైనికులకు పవన్ పిలుపునిచ్చారు. అదే సమయంలో నాగేశ్వర్ కూడా ఈ వివాదం ముగిసిందని ప్రకటించారు.
అయితే నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాక.. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఆయనపై కేసులు నమోదు కాగా… నాగేశ్వర్ అరెస్టు తప్పదన్న వాదనలు వినిపించాయి. ఈ క్రమంలో తెలంగాణ డీజీపీని కలిసిన నాగేశ్వర్ తనకు భద్రత కల్పించాలని కోరారు. అయితే నాగేశ్వర్ అరెస్టు కోసం హైదరాబాద్ వెళ్లిన ఏపీ పోలీసులను తానే వారించానని, నాగేశ్వర్ అరెస్టు అవసరం లేదని చెప్పానని పవన్ చేసిన చెప్పారు. పవన్ వ్యాఖ్యలను ఆధారం చేసుకుని తెలంగాణ జర్నలిస్టులు ఈ మొత్తం వ్యవహారంలో నాగేశ్వర్ ది ఎలాంటి తప్పు లేదని వాదించారు. ఈ క్రమంలోనే తెలంగాణ సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి జనసేనపైనా, టీడీపీపైనా, ఏపీకి చెందిన మీడియా హౌస్ ల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాశం యాదగిరి, ఇతర తెలంగాణ జర్నలిస్టులు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు జనసేనకు చెందిన తెలంగాణ నేత సంపత్ నాయక్ గురువారం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సదంర్భంగా ఆయన తెలంగాణ జర్నలిస్టులపైనా, నాగేశ్వర్ పైనా ఒకింత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడ ఉన్నతెలంగాణ జర్నలిస్టులు ఆయనను చుట్టుముట్టారు.
జర్నలిస్టులను ఇష్ఠానుసారంగా నిందిస్తే సహించేది లేదని జర్నలిస్టులు ఆయనకు దాదాపుగా వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. అయితే తానేమీ అనవసరంగా నోరు పారేసుకోవడం లేదని, మాటకు బదులు మాత్రమే ఇచ్చానంటూ ఎదురు సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారగా… పోలీసులు ఎంట్రీ ఇచ్చి పరిస్తితిని చక్కదిద్దారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates