జ‌గ‌న్ ఇప్పుడు ఫీల‌వుతున్నారా…?

వైసీపీ అధినేత జగన్ ఆవేదన చెందుతున్నారా ? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు.. పార్టీని ముందుకు నడిపించే విషయంలో జరుగుతున్న పొరపాట్లు.. వంటి అంశాలను ఇటీవల ఆయన చర్చించారు. ఈ క్రమంలో పార్టీ విషయంలో గతంలో జరిగిన పరిణామాలు అదేవిధంగా సీనియర్ నాయకుల నుంచి ఎదురైనా ఇబ్బందులు కొంతమంది నాయకులు పార్టీని వీడే వెళ్లిపోవడం ఆ తర్వాత వచ్చిన గ్యాప్ వంటి అంశాలపై ఆయన చర్చించారు.

ఈ క్రమంలో “బాలినేని శ్రీనివాసరెడ్డి సహా మోపిదేవి వెంకటరమణ వంటి సీనియర్ నాయకులను అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని వదులుకొని పొరపాటు చేశామా” అన్న మాట జగన్ నోటి నుంచి వచ్చినట్లు తెలిసింది. వాస్తవానికి వైసీపీ అధినేత అంటేనే పోయే వాళ్ళని పోనివ్వండి అనే టైపు. కానీ ఇలా చేసుకోవడం వల్ల పార్టీ ఇప్పుడు బలహీనపడింది. ఇప్పటికే వాస్తవానికి చాలా నియోజకవర్గాల్లో బలహీన పడింది.

ఈ క్రమంలోనే కొన్నాళ్లకి పార్టీ నుంచి వెళ్లిపోయిన వాళ్ళు తిరిగి వచ్చినా ఆహ్వానం పలుకుతామని జగన్ ప్రకటించారు. కానీ.. వెళ్లిపోయిన వాళ్లే తప్ప, వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనిపించడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో సీనియర్ల ఆవశ్యకత, నియోజకవర్గం.. అదేవిధంగా జిల్లాల స్థాయిలో పార్టీని నడిపించే నాయకుల అవసరం ఎంతో ఉందన్నది వైసిపి నేతల మధ్య జరుగుతున్న చర్చ. ఈ విషయంపైనే ఇటీవల జగన్ నిర్వహించిన ప్రెస్ మీట్ అనంతరం నాయకులతో అంతర్గతంగా చర్చలు జరిపారు.

సీనియర్ నాయకులు వెళ్లిపోయిన‌ అంశం ఈ సందర్భంగా చర్చించారు. అయితే ఒక్కళ్ళు కూడా వెనక్కి రాకపోవడం.. భవిష్యత్తు పరిణామాలు.. ఏంటి అనే విషయాన్ని ఆలోచించి వచ్చే నాయకులకు ఆహ్వానం పలకాలని మ‌రోసారి చెప్పిన‌ట్టు తెలిసింది. ఎవరు ఎప్పుడు వచ్చినా తీసుకోవాలని చెప్పారు. కానీ, ఒకవైపు పార్టీపై జరుగుతున్న ప్రచారం.. ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్ల కారణంగా వైసిపి విషయంలో ప్రజల ఆలోచన సరళి ఏమాత్రం మెరుగు పడలేదని సీనియర్లు వివరించారు.

దీంతో వచ్చేవాళ్ళు కూడా రావడం లేదని, ఉన్న కొద్దిమంది నాయకులు కూడా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగన్ కు సమాచారం చేరింది. ఈ పరిణామాల నేప‌థ్యంలో ఆయన మ‌రోసారి పాదయాత్ర వరకు వేచి చూడాలని పార్టీ పుంజుకుంటుందని వారికి భరోసా అయితే కల్పించారు. కానీ, అంతర్గతంగా మాత్రం జగన్లో ఆవేదన కనిపించిందని ఓ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించటం విశేషం.