వైసీపీకి చెందిన మహిళా నాయకురాలు.. సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే.. విశ్వసరాయి కళావతి.. నమ్మకానికి పెట్టింది పేరు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైసీపీకి మద్దతు పలికిన తొలి మహిళా నాయకురాలిగా ఆమె గురించి పార్టీలో చెబుతారు. వరుసగా రెండుసార్లు ఆమె వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే.. పార్టీ పరంగా ఆమెకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. నిజానికి పార్టీలోనే కాకుండా.. నియోజకవర్గంలో కూడా విశ్వసరాయికి మంచి పేరుంది. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలన్న విధంగా ఆమె వ్యవహరించారు.
ముఖ్యంగా వరుస విజయాలు దక్కించుకున్న విశ్వసరాయి.. మంత్రి పదవిని ఆశించారు. ఎస్టీ సామాజిక వర్గమే అయినా పార్టీలో ఆమెకు ఆశించిన విధంగా పదవి దక్కలేదు. ఇక, గత ఎన్నికల్లో పరాభవం కూడా ఆమెకు మైనస్‌గా మారిపోయింది. మరోవైపు.. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఆమె వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ఈ పరిణామాలతోపాటు.. పార్టీ వైపు నుంచి కూడా కళావతికి పెద్దగా సహకారం లేదన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి కళావతి ఎన్నికల పోటీ నుంచి తప్పుకొంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
మరోవైపు.. పార్టీ కూడా.. పాలకొండ రాజకీయాల పర్యవేక్షణను వేరే నేతకు అప్పగించడంతో కళావతి హర్ట్ అయ్యారన్న ప్రచారం కూడా ఉంది. ఇక, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మక జయ కృష్ణ దూకుడు చూస్తే.. మరోసారి విజయం ఖాయమని అంటున్నారు.
ఈ మొత్తం పరిణామాలతో విశ్వసరాయి కళావతి వచ్చే ఎన్నికల నుంచి తప్పుకొనే ప్రతిపాదన దిశగానే ఉన్నారన్నది స్థానికంగా జరుగుతున్న చర్చ. ఇటీవల నిమ్మక చేసిన వ్యాఖ్యలు కూడా దీనిని బల పరుస్తున్నాయి.
మనకు ఎవరూ పోటీ లేరని.. ప్రత్యర్థులు కూడా లేరని.. ఉండరని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ ఉన్నా.. పొరుగు జిల్లాల నుంచి నాయకులు వస్తే.. వారిని ఓడించడం పెద్ద కష్టం కూడా కాదన్నారు. ఈ పరిణామాలతో పాలకొండ రాజకీయాలు ఏకపక్షంగా మారుతున్నాయన్న చర్చ సాగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates