తెలుగు హీరోలు నా ద‌గ్గ‌రికొచ్చి బీర్లు తాగేవారు-రేవంత్

సాధార‌ణంగా ఏ రాష్ట్రంలో అయినా ముఖ్య‌మంత్రితో సినీ ప్ర‌ముఖులు స‌న్నిహిత సంబంధాలు క‌లిగి ఉండడానికి ప్ర‌య‌త్నం చేస్తుంటారు. గ‌తంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడితో సినీ రంగంలో చాలామందికి స‌న్నిహిత సంబంధాలుండేవి. ఏపీ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డ్డాక కూడా అవి కొన‌సాగుతున్నాయి.

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం అయ్యాక కేసీఆర్ సినీ ప్ర‌ముఖుల‌ను ద‌గ్గ‌రికి రానిచ్చేవారు కాదు కానీ.. ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్‌తో మాత్రం ఇండ‌స్ట్రీ జ‌నాలు క్లోజ్‌గా ఉండేవాళ్లు. ఐతే తెలంగాణకు రెండో ముఖ్య‌మంత్రి అయిన రేవంత్ రెడ్డికి, సినిమా వాళ్ల‌కు అంత మంచి సంబంధాలు లేవ‌నే చ‌ర్చ మొద‌ట్నుంచి న‌డుస్తోంది.

ఏడాదిన్న‌ర ముందు అల్లు అర్జున్ అరెస్ట్ వ్య‌వ‌హారంతో ఈ చ‌ర్చ మ‌రింత ఊపందుకుంది. ఐతే రేవంత్ విష‌యంలో సినిమా వాళ్లు ఏమనుకుంటారు అన్న‌ది ప‌క్క‌న పెడితే.. సినిమా వాళ్ల గురించి రేవంత్ అభిప్రాయం ఏంటి అన్న‌ది ఆస‌క్తిక‌రం.

ఒక చ‌ర్చా కార్య‌క్ర‌మంలో రేవంత్‌ను ఇదే విష‌య‌మై హోస్ట్ ప్ర‌శ్నించారు. మిమ్మ‌ల్ని బాలీవుడ్ వాళ్లు వ‌చ్చి క‌లుస్తుంటారు, మ‌రి తెలుగు సినీ ఇండ‌స్ట్రీ నుంచి ఎవ‌రూ వ‌చ్చి మిమ్మ‌ల్ని క‌ల‌వ‌రేంటి అని అడిగితే.. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీని ఏలుతున్న వాళ్లంద‌రినీ తాను చిన్న‌ప్ప‌టి నుంచి చూస్తున్నాన‌ని రేవంత్ అన్నారు. వాళ్ల లోటు పాట్ల‌తో స‌హా అన్ని విష‌యాలూ త‌న‌కు తెలుస‌ని రేవంత్ అన్నారు.

ఇప్పుడు పెద్ద హీరోలుగా ఉన్న చాలామంది టీనేజీలో త‌న ద‌గ్గ‌రికి వ‌చ్చి మీరు సంత‌కం పెడితే ఒక బీర్ తాగుతాం అన్నా అంటూ అడిగేవార‌ని రేవంత్ చెప్పారు. వాళ్ల జ‌ర్నీ మొద‌ట్నుంచి త‌న‌కు తెలుసని.. కాబ‌ట్టి ఇప్పుడు వ‌చ్చి తాము అది ఇది అని మాట్లాడ‌లేరని, వాళ్ల విష‌యాల‌న్నీత‌న‌కు తెలుసు కాబ‌ట్టే త‌న‌ను వ‌చ్చి క‌ల‌వ‌ర‌ని రేవంత్ పేర్కొన్నారు.

తాను ధూల్ పేట‌లో గుడుంబా న‌డిపేవాళ్ల‌తో అయినా.. ఫిలిం ఇండ‌స్ట్రీకి చెందిన పెద్దోళ్ల‌తో అయినా.. ఏదైనా కార్పొరేట్ కంపెనీ సీఈవో వ‌చ్చినా.. ఒకే ర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని.. చిన్న రాజ‌కీయ నాయ‌కుడి ద‌గ్గ‌ర్నుంచి పీఎం వ‌ర‌కు అంద‌రి ముందు ఒకేలా ఉంటాన‌ని.. వంగి వంగి దండాలు పెట్ట‌డం, అతివిన‌యం ప్ర‌ద‌ర్శించ‌డం ఉండ‌ద‌ని రేవంత్ స్ప‌ష్టం చేశారు. ఇది త‌న వ‌ర్కింగ్ స్ట‌యిల్ అని.. అలాగే సీఎం అయ్యాన‌ని.. ఇక ముందూ అందులో మార్పేమీ ఉండ‌ద‌ని రేవంత్ తేల్చి చెప్పారు.