టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో విజయం దక్కించుకున్న చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉదాహరణకు గాజువాక నియోజకవర్గంలో టిడిపి ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఊహించని మెజారిటీని సాధించారు. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ కూడా 90 వుల పైచిలుకు మెజారిటీని దక్కించుకున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది నాయకులు భారీ మెజారిటీని సొంతం చేసుకున్నారు.
అయితే ఆ సమయంలో కూటమి ప్రభావంతో పాటు వైసిపి వ్యతిరేకత తీవ్ర స్థాయిలో కనిపించింది. దీనివల్లే వీరికి అనూహ్యమైన మెజారిటీ దక్కిందన్న వాదన ఉంది. వచ్చే ఎన్నికల నాటికి ఇదే ప్రభావం కనిపిస్తుందా.. లేకపోతే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి మారుతుందా.. అనేది ఇప్పుడు కొంతమంది నాయకులలో చర్చనీయాంశంగా మారింది. దీంతో తమ మెజారిటీని తగ్గకుండా చూసుకునేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు.
గత ఎన్నికల సమయంలో ఏఏ మండలాల్లో తమకు ఎక్కువగా ఓట్లు పడ్డాయి.. ఏ ఏ సామాజిక వర్గాల నుంచి తమకు ఓట్లు భారీ సంఖ్యలో పడ్డాయి.. అనే విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. తద్వారా ఆయా మండలాలు, ఆయా సామాజిక వర్గాలను మరింత మంచి చేసుకుని వచ్చే ఎన్నికల సమయానికి తమకు మెజారిటీ పెంచుకోవడంతో పాటు ఒకవేళ పెరిగినా పెరగకపోయినా తమ మెజారిటీని తగ్గకుండా చూసుకునేందుకు నాయకులు ప్రయత్నాలు చేయాలని భావిస్తున్నారు.
ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో పల్లా శ్రీనివాసరావు ఇటీవల పర్యటనలు చేస్తున్నారు. తన సామాజిక వర్గం నాయకులతో పాటు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కూడా మమేకమవుతున్నారు. మెజారిటీ తగ్గకుండా చూడాలని ఆయన పదేపదే చెబుతున్నారు. గెలుపు అనేది ఖాయమే అయినప్పటికీ మెజారిటీ ఇప్పుడు ప్రతిష్టాత్మక అంశంగా మారింది. ఇక మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ కూడా ఇదే ప్రయత్నాలు చేస్తున్నారు. తనను ఎవరు కలిసినా మెజారిటీపైనే దృష్టి పెట్టాలని ఆయన చెబుతున్నారు.
ఈ రెండు నియోజకవర్గాలే కాదు రాష్ట్రవ్యాప్తంగా భారీ మెజారిటీ దక్కించుకున్న నాయకులంతా ఇదే పనిపై దృష్టి పెట్టడం విశేషం. మరి వీరు అనుకున్నట్టుగా మెజారిటీ కొనసాగుతుందా లేకపోతే తగ్గుతుందా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే మెజారిటీ తగ్గకుండా చూసుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికిగాను సంక్షేమ పథకాల అమలతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates