తమిళనాట రాజకీయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కగజం (టీవీకే) అతి పెద్ద పార్టీగా అవతరించినా… ప్రభుత్వ ఏర్పాటుకు కాస్తంత దూరంలో ఆగిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు మొత్తంగా 118 సీట్లు అవసరం కాగా… టీవీకేకు 108 సీట్లు మాత్రమే వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో టీవీకే జరిపిన చర్చల్లో 5 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్, రెండేసి సీట్లున్న సీపీఎం, సీపీఐలు విజయ్ సర్కారుక మద్దతు ఇచ్చేందుకు ఒప్పుకున్నాయి. కాంగ్రెస్ నుంచి పెద్దగా ముప్పేమీ లేకున్నా… లెఫ్ట్ పార్టీల నుంచి మాత్రం విజయ్ సర్కారుకు ముప్పుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
రెండేసి సీట్లున్న సీపీఎం, సీపీఐలు విజయ్ సర్కారుకు మద్దతు ఇవ్వడానికి ఒప్పుకున్నా… ప్రభుత్వంలో చేరేందకు మాత్రం ఒప్పుకోలేదు. విజయ్ కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఈ రెండు పార్టీలు…విజయ్ కేబినెట్ లో చేరేందుకు మాత్రం ఒప్పుకోలేదు. తాము బయటి నుంచే విజయ్ కి మద్దతు ఇస్తామని, డీఎంకేతో కలిసి నిర్మాణాత్మక ప్రతిపక్షపాత్రను పోషిస్తామని ఆ పార్టీల నేతలు చెబుతున్నారు. ఇక్కడే విజయ్ ప్రభుత్వానికి చివరి దాకా ఈ రెండు పార్టీలు మద్దతు కొనసాగిస్తాయా? అన్న దిశగా అనుమానాలు రేకెత్తుతున్నాయి.
వాస్తవానికి ఈ రెండు పార్టీలకు ఒక్కో మంత్రి పదవి ఇచ్చే విషయాన్ని స్వయంగా విజయే ప్రతిపాదించారు. శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలోని సీపీఐ కార్యాలయంలో జరిగిన ఈ చర్చల్లో లెఫ్ట్ పార్టీలు తమకు మంత్రి పదవులు ఏమీ అవసరం లేదని చెప్పాయి. మంత్రి పదవులు అక్కర్లేదని, అయితే మద్దతును మాత్రం ఇస్తామని ఆ రెండు పార్టీలు చెప్పాయి. మద్దతు విషయంలో లెఫ్ట్ పార్టీల విజయ్ పార్టీకి అసలు షరతులేమి పెట్టలేదట. ఇక్కడే ఏదో తేడా కొడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
విజయ్ పార్టీకి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ టీవీకే ప్రభుత్వంలో భాగస్వామి అయ్యేందుకు ఒప్పుకుంది. మద్దతు ఇచ్చే పార్టీలు ప్రభుత్వంలో భాగస్వాములు అయితే బాగుంటుంది…ఆ ప్రభుత్వం పూర్తి కాలం మనగలుగుతుంది. అలా కాకుండా బయటి నుంచి మద్దతు అంటే…మద్దతిచ్చే పార్టీకి ఏ మాత్రం కోపం వచ్చినా ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. ఈ విశ్లేషణలతోనే లెఫ్ట్ పార్టీల మద్దతు విజయ్ కు భవిష్యత్తులో ముప్పుగా మారే ప్రమాదం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates