నన్ను రోడ్డు మీద పడేయకండబ్బా – పోసాని

టాలీవుడ్లో ఒకప్పుడు వైభవం చూసిన రచయితల్లో పోసాని కృష్ణమురళి ఒకరు. 90వ దశకంలో పరుచూరి సోదరుల తర్వాత ఎక్కువ సినిమాలు చేసింది ఆయనే. ఆ తర్వాత దర్శకుడిగా, నటుడిగానూ మారి ప్రతిభ చాటుకున్నారు. ఒక దశలో నటుడిగా తీరిక లేకుండా సినిమాలు చేశారు. ఆపై రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. వైసీపీ కోసం పని చేశారు. కానీ వైసీపీ అధికారంలో ఉండగా ప్రతిపక్ష పార్టీల మీద తీవ్ర స్థాయిలో నోరు పారేసుకున్న ఆయన.. అధికారం కోల్పోయాక గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు.

వైసీపీ అధికారంలో ఉన్నపుడు అదుపు తప్పి మాట్లాడిన ఫలితంగా అనేక కేసులు ఎదుర్కొని కొన్ని రోజులు జైలు జీవితం గడిపి వచ్చారు. ఐతే జైలు నుంచి బయటికి వచ్చాక పోసాని రాజకీయాలకు పూర్తిగా దూరం అయిపోయారు. కొంత కాలం అసలు ఎక్కడా కనిపించనే లేదు. ఐతే ఈ మధ్యే పోసాని తిరిగి దర్శకత్వం చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో లీడ్ రోల్ చేయడంతో పాటు కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, నిర్మాణం.. ఇలా అన్ని బాధ్యతలూ తనే తీసుకున్నాడు పోసాని.

తాజాగా ఒక ప్రెస్ మీట్లో పోసాని తాను తీస్తున్న సినిమా గురించి మాట్లాడారు. ఐతే గతంలో పోసాని తీసిన చిత్రాల్లో రాజకీయ అంశాలు ఉన్న నేపథ్యంలో కొత్త చిత్రం కూడా ఇదే తీరుగా ఉంటుందా అని అడిగితే.. ఆయన వామ్మో అంటూ దండం పెట్టేశారు. ‘‘ఈ సినిమాకు రాజకీయాలతో సంబంధమే లేదు. నేను చాన్నాళ్ల తర్వాత సినిమా చేసుకుంటున్నానబ్బా.. నన్ను రోడ్డు మీద పడేయబాకండబ్బా’’ అంటూ పోసాని విలేకరులందరినీ నవ్వించారు.

గతంలో కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్లడం గురించి ఆయన స్పందిస్తూ.. ‘‘ప్రజాసేవలో ఉండాలంటే సేవా చేయాలి. జైలుకూ వెళ్లాలి. తప్పేమీ లేదు. ఇప్పుడు మాత్రం నన్ను కొంచెం నన్ను క్షమిస్తే సినిమా బాగా చేసుకుంటానబ్బా’’ అన్నారు. పోసాని దర్శకత్వం వహించిన ‘ఆపరేషన్ దుర్యోధన’ అప్పట్లో రాజకీయంగానూ సంచలనం రేపింది. ఐతే ఇప్పుడున్న పరిస్థితుల్లో పోసాని వ్యక్తిగతంగా కానీ, సినిమాల పరంగా కానీ ఎంతమాత్రం రాజకీయాల జోలికి వెళ్లే అవకాశం లేదన్నది స్పష్టం.