ఏపీలో అధికార కూటమి రథసారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో గురువారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గ పార్టీ ఇంచార్జీ ఎన్వీఎస్ఎన్ వర్మను ఆ పదవి నుంచి తప్పించారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం గురువారం ఉదయం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ పదవి నుంచి తప్పించడం పెద్ద వార్తేమీ కాదు గానీ.. పిఠాపురం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో…ఆ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ పదవి నుంచి వర్మను తప్పించడం పెద్ద సంచలనంగా మారింది.
గతంలో టీడీపీ నుంచే పిఠాపురం నుంచి వర్మ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చాలా కాలంగా ఆ నియోజకవర్గ ఇంచార్జీగానూ ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లోనూ పిఠాపురం టీడీపీ అభ్యర్థిగా వర్మకే ఛాన్స్ దక్కేది. అయితే ఊహించని విధంగా జనసేనతో టీడీపీ పొత్తు కుదరడం, జనసేన అధినేత హోదాలో పవన్ పిఠాపురం నియోజకవర్గాన్నే ఎంచుకోవడంతో వర్మ పోటీ నుంచి తప్పుకోక తప్పలేదు. అయితే పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ప్రత్యామ్నాయ పదవులు ఇస్తామని చెప్పిన చంద్రబాబు… ఇటీవలే పార్టీలో ఉపాధ్యక్ష పదవిని ఇచ్చి గౌరవించారు.
అయితే టీడీపీ, జనసేన రెండూ కలిసే ఉన్నా… పిఠాపురంలో రెండు పార్టీల మధ్య తరచూ వివాదాలు చెలరేగుతూ ఉన్నాయి. ఇటీవలే ఓ అధికారిక కార్యక్రమంలో చంద్రబాబు ఫొటో లేకుండా కేవలం పవన్ ఫొటోతోనే ఫ్లెక్సీ ఏర్పాటు చేశారంటూ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన నేతలతో ఆయన వాగ్వాదానికి దిగారు.
జనసేనకు చెందిన మాజీ వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఏకంగా వర్మపైకి దూసుకువెళ్లన దృశ్యాలు కూడా వైరల్ గా మారాయి. ఈ వివాదంపై చంద్రబాబు ఆ తర్వాత ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ స్థాయి నేతలుగా ఉంటూ బహిరంగంగా వాదులాడుకుంటారా? అంటూ మండిపడ్డ చంద్రబాబు… ఆ మాత్రం ఓపిక, సహనం లేకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే జరిగిన వివాదం గురించి పూర్తి వివరాలు సేకరించిన చంద్రబాబు… తప్పు వర్మదేనని తేల్చేశారు. పార్టీ కార్యకర్తలకు చెడు సంకేతాలు ఇచ్చేలా వర్మ వ్యవహరించారని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఇటీవలే చంద్రబాబును వర్మ కలిశారు. జరిగిన ఘటనపై వివరణ ఇచ్చే యత్నం చేశారు.
ఈ సందర్భంగా ఏం జరిగిందో తెలియదు గానీ… వర్మను పిఠాపురం టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీ పదవి నుంచి తప్పిస్తూ పార్టీ అధిష్ఠానం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక పిఠాపురం పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ తెలిపింది. ఈ కమిటీ ఏర్పాటుపై ఇప్పటికే కసరత్తు మొదలుకాగా.. త్వరలోనే ఆ కమిటీని ప్రకటించే అవకాశాలున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates