దీదీ రాజీనామా చెయ్యకపోతే ఏం జరుగుతుంది?

దేశంలో అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలు ముగిశాయి. మూడు రాష్ట్రాల్లో అధికార పార్టీలు పరాజయం పాలయ్యాయి. వాటిలో కీలక రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ ఉంది. ఈ లెక్కన ఓడిపోయిన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోక తప్పని పరిస్థితి.

అయితే ఎన్నికలు న్యాయబద్ధంగా జరగలేదని ఆరోపిస్తూ… సీఎం పదవి నుంచి తాను దిగేది లేదంటూ తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బెంగాల్ లో ప్రజలు గెలిపించిన కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టాలంటే…దీదీ అధికారాన్ని వదిలేయాలి కదా. మరి ఆమె సీఎం పదవికి రాజీనామా చేయకపోతే ఎలా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీదీ రాజీనామా చేయకున్నా… ఆమె పదవి దానికదే ఊడిపోతుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యమంత్రి పదవి చేపట్టాలంటే…ఎమ్మెల్యేగానో, ఎమ్మెల్సీగానో ఎన్నిక కావాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆ నేత ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి అసెంబ్లీలో స్పష్టమైన మెజార్టీ ఉండాలి. అలా మెజారిటీ లేకుంటే… విశ్వాస పరీక్ష నిర్వహిస్తే సదరు నేత సీఎం పదవికి రాజీనామా చేసి తీరక తప్పదు.

ఇప్పుడు బెంగాల్ విషయానికి వస్తే… ఈ నెల 7 అంటే… గురువారంతో ప్రస్తుత అసెంబ్లీ పదవీ కాలం ముగుస్తుంది. అసెంబ్లీ రద్దు అంటే… అప్పటిదాకా అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఉన్నవారంతా తమ పదవులను కోల్పోతారు. కొత్తగా ఎన్నికైన అసెంబ్లీతో గవర్నర్ నూతన అసెంబ్లీని సమావేశ పరుస్తారు. ఈ సభలో మెజారిటీ కలిగిన పార్టీకి చెందిన నేత సీఎంగా ఎంపిక అవుతారు.

ఈ లెక్కన గురువారం అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు బెంగాల్ గవన్నర్ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఫలితంగా బుధవారం దాకా ఎమ్మెల్యేలుగా కొనసాగిన వారంతా తమ పదవులను కోల్పోతారు. ఈ క్రమంలో సీఎం హోదాలో ఉన్న దీదీ కూడా పదవిని కోల్పోతారు. కొత్తగా ఏర్పడే అసెంబ్లీలో మెజారిటీ లేక, కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవని దీదీ…సీఎంగా రాజీనామా చేయకున్నా… ఆమె సీఎం గిరీ దానికదే ముగిసిపోతుంది. ఇదే విషయాన్ని గమనించి దీదీ తన సీఎం పదవికి రాజీనామా చేస్తే సరేసరి. లేదంటే గవర్నర్ ఆమెను సీఎం పదవి నుంచి దింపేస్తున్నట్లుగా ప్రత్యేకంగా ఉత్తర్వులు చేస్తారు. అప్పుడు దీదీ సీఎం పదవిని నుంచి ఏకంగా డిస్మిస్ చేయబడతారు.

రాజ్యాంగంలోని ఆయా అధికారణాలు చెబుతున్న ఈ విషయాలను గమనిస్తూ వస్తున్న నేతలు… తమ పార్టీ అధికారం కోల్పోయినప్పుడు తక్షణమే సీఎం పదవులకు రాజీనామా చేస్తున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇప్పటికే తన పదవికి రాజీనామా చేయగా…కొత్త సీఎంగా విజయ్ గురువారం పదవీ ప్రమాణం చేయనున్నారు. ఇలాంటి నేపథ్యంలో పాత అసెంబ్లీ రద్దు అయిపోతున్న తరుణంలో దీదీ తన సీఎం పదవికి రాజీనామా చేస్తే… రాజ్యాంగానికి మర్యాద ఇచ్చినట్లుగా ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలా కాకుండా సీఎం పదవికి రాజీనామా చేయకపోతే…దీదీని ఆ పదవి నుంచి డిస్మిస్ చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకోక తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే… ఓటమితో ఇప్పటికే మనస్తాపానికి గురైన దీదీ… డిస్మిస్ ఆర్డర్లతో మరింతగా చెడ్డ పేరు తెచ్చుకుంటారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.