విజయ్‌ని ఇప్పట్లో కదిలించలేరా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. నిన్న ఒకే రోజు ఐదు రాష్ట్రాల ఫలితాలు వచ్చినప్పటికీ.. దేశమంతా ఎక్కువ మాట్లాడుకున్నది తమిళనాడు గురించే. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ను మట్టికరిపించి బీజేపీ ఘనవిజయం సాధించడం కూడా గొప్ప విషయమే అయినప్పటికీ.. విజయ్ సాధించిన విజయం అసాధారణమైంది.

రెండేళ్ల ముందు రాజకీయాల్లోకి అడుగు పెట్టి, పార్టీ నిర్మాణం కూడా సరిగా చేయని వ్యక్తి.. పట్టుమని పది సభలు కూడా పెట్టని నాయకుడు.. నేరుగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోతుండడం సంచలనమే.

ఐతే విజయ్ మరీ గాలివాటంగా సీఎం అయిపోయాడని అనుకోవడానికి కూడా లేదు. గత దశాబ్ద కాలంలో అతను తమిళ సినీ రంగంలో ఇంతింతై అన్నట్లు ఎదిగాడు. ఇంటింటా అభిమానులను సంపాదించుకున్నాడు. యువతలో సాధించిన తిరుగులేని ఫాలోయింగ్ ఓట్లుగా మారింది.

మహిళలను మెప్పించే హామీలు ఇవ్వడం కలిసొచ్చింది. మరోవైపు డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలతో విసుగెత్తిపోయిన జనాలు.. విజయ్‌కి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అనుకున్నారు. ఫలితమే.. విజయ్ సాధించిన అసాధారణ విజయం.

ఐతే మెజారిటీకి కొంచెం దూరంలో ఆగిపోయాడని.. రాజకీయాల్లో, ప్రభుత్వాన్ని నడపడంలో అనుభవం లేదని.. అతణ్ని ఈజీగా గద్దె దించేయొచ్చని, వచ్చే ఎన్నికల నాటికి అతడి కథ ముగించేయొచ్చని ప్రత్యర్థి పార్టీలు అనుకుంటే తప్పులో కాలేసినట్లే.

అధికారంలోకి రావడానికి అతను కాంగ్రెస్ సహా కొన్ని చిన్న పార్టీల సాయం తీసుకునే అవకాశముంది. అన్నాడీఎంకే వైపు కూడా అతను చూడకపోవచ్చని తెలుస్తోంది. చిన్న పార్టీలను కలుపుకుని బొటాబొటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు కాబట్టి.. కొందరు ఎమ్మెల్యేలను లాగేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని డీఎంకే చూసినా.. లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ, అన్నాడీఎంకేతో కలిసి కుట్ర చేసినా మొదటికే మోసం రావచ్చు.

విజయ్ అధికారంలోకి వస్తాడన్న నమ్మకం చాలామందిలో లేనపుడే అతడికి పెద్ద ఎత్తున ఓటేశారు. అధికారానికి దగ్గర్లో నిలబెట్టారు. కానీ తన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసి, మధ్యంతర ఎన్నికల్లాంటివి వస్తే.. జనం అతడికి బంపర్ మెజారిటీ ఇచ్చి దర్జాగా సీఎం కుర్చీలో కూర్చోబెడతారనడంలో సందేహం లేదు.

ఇక సీఎంగా విజయ్ చెత్త పరిపాలన చేస్తే తప్ప.. అతను మరింత బలపడే ఛాన్స్ ఉంది. మంచి పనితీరు కనిపిస్తే వచ్చే పర్యాయం ఇంకా బలమైన రాజకీయ శక్తిగా మారి ఘనవిజయంతో మరోసారి సీఎం అయ్యే అవకాశాలున్నాయి.