తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ముందంజలో ఉండటం చూస్తుంటే, అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రయాణం గుర్తొస్తోంది. నిజానికి విజయ్ కంటే రజినీకాంత్ కు ఉన్న ఇమేజ్, పాపులారిటీ చాలా ఎక్కువ. దశాబ్దాలుగా ఆయన రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుకున్నారు, దానికి తగ్గట్టుగానే రజినీకాంత్ కూడా ఎంతో గ్రౌండ్ వర్క్ చేశారు. తన అభిమాన సంఘాలను ‘రజినీ మక్కల్ మన్రమ్’గా మార్చి, క్షేత్రస్థాయిలో బలోపేతం చేశారు. కానీ చివరకు ఆరోగ్య కారణాలు చూపి ఆయన వెనకడుగు వేయడం కోట్లాది మంది అభిమానులను నిరాశకు గురిచేసింది.
విజయ్ విషయంలో చాలా నెగిటివిటీ ఉన్నప్పటికీ, ఆయన ధైర్యంగా అడుగు వేసి పార్టీని స్థాపించారు. రజినీకాంత్ మీద విజయ్ మీద ఉన్నంత వ్యతిరేకత లేదు, పైగా అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిగా ఆయనకు పేరుంది. రజినీ రాజకీయాల్లోకి వచ్చి ఉంటే తమిళనాట గేమ్ మరోలా ఉండేవని ఇప్పటికీ చాలామంది నమ్ముతారు. కానీ రజినీకాంత్ పదేపదే నిర్ణయాలు మారుస్తూ, చివరకు రాజకీయాలకు స్వస్తి పలకడం విజయ్ వంటి యువ నటులకు మార్గం సుగమం చేసినట్లయింది.
విజయ్ తన మేనిఫెస్టోలో భారీ హామీలు ఇచ్చారు. రజినీకాంత్ కూడా గతంలో ‘ఆధ్యాత్మిక రాజకీయం’ అంటూ కొత్త పంథాను చూపించాలని ప్రయత్నించారు. అయితే రజినీకాంత్ లో ఉన్న సందిగ్ధత విజయ్ లో కనిపించకపోవడం, తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే సినిమా రంగాన్ని వదిలి రాజకీయాల్లోకి రావడం విజయ్ కు ప్లస్ అయ్యింది.
రజినీకాంత్ కనుక పక్కా ప్లానింగ్ తో బరిలోకి దిగి ఉంటే, ఇమేజ్ పరంగా ఆయనను ఢీకొట్టడం ఎవరికీ సాధ్యమయ్యేది కాదు. కానీ ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ఆ లోటును విజయ్ భర్తీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకే వంటి దిగ్గజ పార్టీలను కాదని తమిళ ప్రజలు ఒక కొత్త మార్పును కోరుకుంటున్నారని విజయ్ పార్టీకి వస్తున్న ఆదరణ చూస్తుంటే అర్థమవుతోంది. చివరికి రజినీకాంత్ రిటైర్మెంట్ ప్రకటించడం ఒక చారిత్రక తప్పిదమా లేక సరైన నిర్ణయమా అనేది పక్కన పెడితే, ఆయన వదిలేసిన రాజకీయ శూన్యాన్ని విజయ్ అందిపుచ్చుకున్నారన్నది వాస్తవం.
Gulte Telugu Telugu Political and Movie News Updates