తమిళనాడులో విజయ్ టీవీకే ప్రభంజనం

ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల ఫలితాల కోసం చాలామంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ అనే రీతిలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు అన్న విషయంపై హై టెన్షన్ ఏర్పడింది. తమిళనాట కొత్త పార్టీ పెట్టిన విజయ్ అధికారంలోకి వస్తారంటూ కొన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఆ ఫలితాలపై కూడా ఆసక్తి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో ఈరోజు వెలువడుతున్న ఫలితాలు పలువురిని ఆశ్చర్యానికి గురి చేశాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ అనూహ్యంగా తమిళనాట దూసుకుపోతోంది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకేలను వెనక్కి నెట్టి 109కు పైగా స్థానాల్లో టీవీకే లీడ్ లో కొనసాగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అన్నా డీఎంకే 75 స్థానాల్లో, డీఎంకే 50 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి. మరోపక్క సీఎం స్టాలిన్ తో పాటు ఆయన తనయుడు మంత్రి ఉదయనిది స్టాలిన్ వెనుకంజలో ఉండటం షాకింగ్ గా మారింది.

అదే సమయంలో పశ్చిమ బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీకి ఆమె ప్రత్యర్థి సువేందు అధికారి షాకిచ్చేలా కనిపిస్తున్నారు. దీదీ పోటీ చేసిన భవానీపుర్, నందిగ్రామ్ రెండు స్థానాల్లోనూ ఆమెపై సువేందు లీడ్ లో కొనసాగుతున్నారు. బెంగాల్ లో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా బీజేపీ ముందంజలో కొనసాగుతోంది.
బీజేపీ 170 స్థానాల్లో లీడ్ లో ఉండగా, టీఎంసీ 117 స్థానాల్లో లీడ్ లో ఉంది.

కేరళలో యూడీఎఫ్ 97 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎల్డీఎఫ్ 41 స్థానాల్లో లీడ్ లో ఉంది. సీఎం పినరాయి విజయన్ వెనుకంజలో ఉన్నారు. అస్సాంలో బిజెపి హవా కొనసాగుతోంది. బీజేపీ 101 స్థానాల్లో లీడ్ లో ఉండగా, కాంగ్రెస్ 23 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలొ ఎన్ర్నార్ కాంగ్రెస్ 16 స్థానాల్లో లీడ్ లో ఉంది. కాంగ్రెస్ 8 స్థానాల్లో లీడ్ లో ఉంది.