విశాఖపట్నం కీర్తి .. విశ్వఖ్యాతికి చేరింది. ఇక్కడ ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక గూగుల్ ఏఐ డేటా కేంద్రానికి ఈ రోజు(మంగళవారం) భూమి పూజ జరిగింది. విశాఖపట్నంలోకి ఆనందపురం మండలం తర్లువాడలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గూగుల్ గ్లోబల్ ఇన్ ఫ్రా, క్లౌడ్ వైస్ ప్రెసిడెండ్ బికాస్ కోలే, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు డేటా కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఒక గిగా వాట్ సామర్థ్యంతో లక్షా 35 వేల కోట్ల భారీ పెట్టుబడితో మెగా డేటా సెంటర్‌ను గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనుంది. డేటా సెంటర్‌కు తర్లువాడ, అడవివరం, రాంబిల్లిలో మొత్తం 600 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి ముందు గూగుల్ ఎక్స్ పీరియన్స్ జోన్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు.
భారీ ఉపాధి: గూగుల్
గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం గూగుల్ క్లౌడ్, గ్లోబల్ ఇన్ ఫ్రా వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే మాట్లాడుతూ. గూగుల్ ఇండియా ఏఐ హబ్‌కు ఇవాళ చేసిన శంకుస్థాపన 2047 వికసిత్ భారత్‌కు ఓ పునాది రాయి లాంటిదన్నారు. ఏఐ యుగంలో విశాఖలో ఏర్పాటు చేస్తున ఈ డేటా సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. భారత డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్‌లోనూ ఈ డేటా సెంటర్ అత్యంత ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు.
గ్లోబల్ ఏఐ ఎకానమీ దిశగా ఇప్పుడు విశాఖ, ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతుందని తెలిపారు. ఇంటర్నే షనల్ సబ్ సీ గేట్ వే గా ఉన్న ముంబై , చెన్నైలతో పాటు విశాఖ కూడా ఇప్పుడు కీలకంగా మారిందని, కొత్త ఫైబర్ ఆప్టిక్ లైన్లు ఇతర ప్రాంతాలతో విశాఖను అనుసంధానం చేస్తాయని వివరించారు. సముద్ర గర్భ లైన్లతో సంప్రదాయ నౌకాయాన మార్గాలు ఇక డిజిటల్ ట్రేడ్ రూట్లుగా మారతాయని తెలిపారు. అదానీ కనెక్స్, ఎయిర్ టెల్ నెక్స్‌ట్రా ఈ డేటా సెంటర్ ఏర్పాటులో భాగస్వామ్యం వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఇండస్ట్రియల్ కారిడార్‌గా ఎదుగుతున్న ఈ ప్రాంతానికి టెక్ ఫ్యూచర్ ను అందించేలా ఈ డేటా సెంటర్ ఉంటుందని, స్థానిక యువతకు ఉద్యోగ భద్రత, ఇంధన భద్రత, నీటి వినియోగం లాంటి అంశాలతో స్థానిక భాగస్వామ్యంతో ముందుకు అడుగులు వేస్తామని హామీ ఇచ్చారు. యువతకు భవితను అందించేలా వారికి అడ్వాన్స్ డ్ క్లౌడ్, ఏఐలో శిక్షణ కార్యక్రమాలు కూడా గూగుల్ నిర్వహిస్తుందని తెలిపారు. 10 వేల మందికి పైగా మహిళలకు మైక్రో ఎంట్రప్రైజ్ గా మారేందుకు కూడా సహకారం అందిస్తామన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
