రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా పనిచేశాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయి విజయాన్ని కూటమి దక్కించుకుంది. నాడు కూటమిని విజయతీరాలకు చేర్చిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అమలు చేసిన వ్యూహాలు దేశంలోని దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలను ఆకట్టుకున్నాయి.
తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తమిళనాడులోని అధికార డీఎంకే బాబు నోట వినిపించిన సూపర్ 6ను అందిపుచ్చుకుంది. చెన్నై సూపర్ 6 పేరిట డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన పార్టీ హామీలను ప్రకటించారు.
తమిళ రాజకీయాల విషయానికి వస్తే… తమిళనాడు అంతా ఒక ఎత్తు అయితే… 22 అసెంబ్లీ సీట్లు ఉన్న రాజధాని చెన్నై నగరం మరో ఎత్తు. చెన్నైలో విజయం సాధిస్తే… రాష్ట్రవ్యాప్తంగానూ ఆ పార్టీకి విజయం దక్కి తీరుతుందన్నది అక్కడి మాట. అంతేకాకుండా దాదాపుగా అన్ని పార్టీలకు చెందిన హేమాహేమీలు నగరంలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారు.
ప్రస్తుతం స్టాలిన్ తో పాటు ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి, టీవీకే అధినేత విజయ్ చెన్నైలో సీట్ల నుంచే పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో చెన్నై ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డీఎంకే చెన్నై సూపర్ 6 పేరిట ప్రత్యేక హామీలను గుప్పించింది.
బాబు తరహా సూపర్ 6 మాదిరి స్టాలిన్ నోట నుంచి వచ్చిన చెన్నై సూపర్ 6 హామీల విషయానికి వస్తే…చెన్నైలో ప్రధానంగా సౌకర్యాలను మెరుగుపరిచే విషయాలను అందులో ప్రస్తావించారు. నగరంలో వెయ్యి మినీ బస్సులను కొత్తగా ప్రవేశపెట్టడంతో పాటుగా నగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు ఏఐ వినియోగం, ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించడం, నగరంలో కీలకమైన రహదారి ప్రాజెక్టులను పూర్తి చేయడం, రహదారుల వెంట చెట్లను పెంచడం, నగరంలో ప్రపంచ స్థాయి సదుపాయాల కల్పన, మెట్రో రైలు విస్తరణ, వీధి కుక్కల నియంత్రణ, వెటర్నరీ వైద్యులు, క్షేత్రస్థాయి సిబ్బందిని మూడింతలు పెంచడం వంటి అంశాలు ఉన్నాయి. ఇక నగరంలో రూ.10 వేల కోట్లతో టెక్నాలజీ హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లుగా ఆ హామీల్లో స్టాలిన్ ప్రకటించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates