తమిళనాడులో చంద్రబాబు ప్రచారం… అజెండా ఏంటి?

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున దక్షిణాదిలో ప్రచారం చేయనున్న ఆయన, మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ నెల 20, 21 తేదీల్లో జరిగే ప్రచారంలో భాగంగా చంద్రబాబు రేపు అమరావతి నుంచి కోయంబత్తూరు బయల్దేరి వెళతారు. కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవడి ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. హోసూరు సమీపంలోని తాలి వద్ద బహిరంగ సభలో ప్రసంగించనుండగా, ఆవడిలో రోడ్ షో నిర్వహించి ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతు కోరనున్నారు.

రెండో రోజు మధురై, సాత్తూర్ ప్రాంతాల్లో ప్రచారం కొనసాగించనున్నారు. స్థానిక నేతలతో సమీక్షలు నిర్వహిస్తూ, రాష్ట్రంలో కూటమి వ్యూహాలపై చర్చించే అవకాశముంది. ముఖ్యంగా పట్టణాలతో పాటు పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తారని సమాచారం.

గతంలో ఫిబ్రవరిలో ఢిల్లీలో ఎన్డీఏ తరపున ప్రచారం చేసిన చంద్రబాబు, ఉత్తరాదిలో ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. ఇప్పుడు దక్షిణాదిలో ప్రచారం చేయడం ఆయనకు కొత్త దశగా భావిస్తున్నారు. తమిళనాడులో ఎన్డీఏ స్థిరపడేందుకు కీలక నాయకుడిగా ఆయన పాత్ర పెరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన తర్వాత, ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను చంద్రబాబు భుజానికెత్తుకున్నట్లు కనిపిస్తోంది. విపక్షాల వైఖరిని ఎండగట్టడంతో పాటు, మహిళా సాధికారతపై తమ కట్టుబాటును వివరించే ప్రయత్నం చేయనున్నట్లు సమాచారం.

ఈ పర్యటన ద్వారా తమిళనాడులో ఎన్డీఏ ప్రభావాన్ని పెంచడం, దక్షిణాదిలో కూటమి బలాన్ని విస్తరించడం లక్ష్యంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.