వైసీపీ అధినేత జగన్ ప్రతిపాదించిన మావిగన్(మచిలీపట్నం+విజయవాడ+గుంటూరు నగరాలనుకలుపుతూ ఏర్పాటు చేసే రాజధాని)పై పెద్ద ఎత్తున వివాదం లేచిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అమరావతిని మరింత పటిష్టం చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధానిని పూర్తిగా ఎనిమిది(అష్ట) జోన్లుగా విభజింది. దీంతో మావిగన్ ప్రాంతాలు సహా.. మరిన్ని ప్రాంతాలు ఈ రాజధాని పరిధిలోకి వచ్చాయి. ఫలితంగా మొత్తం రాజధాని ప్రాంతం 8,352.69 చదరపు కిలోమీటర్లకు చేరుతుంది. తద్వారా రేపు ప్రాంతీయ విభేదాలు కానీ.. మావిగన్ ప్రతిపాదన కానీ తెరమీదకు వచ్చే అవకాశం లేకుండా చర్యలు తీసుకుంది.
ఇవీ జోన్‌లు..
మధ్య, పశ్చిమ, ఉత్తర, ఈశాన్య, తూర్పు, దక్షిణ, ఆగ్నేయ, నైరుతి జోన్లుగా అమరావతి రాజధానిని పేర్కొంది. ఆయా జోన్ల పరిధిలోకి వచ్చే ప్రాంతాలను కూడా ప్రభుత్వం వివరించింది. దీనిలోకి వచ్చే అన్ని ప్రాంతాలు కూడా అమరావతి రాజధాని పరిధిలోనే ఉంటాయని స్పష్టం చేసింది.
జోన్‌ల వారీగా..
1) సెంట్రల్(మధ్య) జోన్: రాజధాని అమరావతి నగరం – విజయవాడ నగరాలు ఉంటాయి. ఈ జోన్‌లో ప్రధాన నగరాలు, మండలాలు ఉంటాయి. దీనిలో రాజధాని నగరం 217 చదరపు కిలో మీటర్ల మేరకు ఉంటుంది. మిగిలిన ప్రాంతం విజయవాడ నగరం.
2) వెస్ట్రన్(పశ్చిమ) జోన్: అమరావతికి పశ్చిమ దిశలో ఉన్న కృష్ణా జిల్లా, ఎన్.టీ.ఆర్ జిల్లాల సరిహద్దు ప్రాంతాలు ఉంటాయి.
3) నార్తర్న్(ఉత్తర) జోన్: రాజధాని ప్రాంతానికి ఉత్తరం దిక్కుగా ఉన్న మైలవరం, నూజివీడు ప్రాంతాలను దీనిలో చేర్చారు.
4) నార్త్ ఈస్ట్(ఈశాన్య) జోన్ : గన్నవరం ఎయిర్‌పోర్ట్ సహా పలు గ్రామాలు దీనికి పరిధిలోకి వస్తాయి.
5) ఈస్ట్రన్(తూర్పు) జోన్: కృష్ణా జిల్లాలోని ప్రధాన వ్యవసాయ, వాణిజ్య ప్రాంతాలైన ఉయ్యూరు, పెనమలూరు, కంకిపాడు వరకు దీనిలో చేర్చారు.
6) సౌత్ వెస్ట్(నైరుతి) జోన్ : పల్నాడు, గుంటూరు జిల్లాలలోని కీలక ప్రాంతాలను ఈ జోన్‌లో కలిపారు. ఇవి కూడా రాజధానికి అనుసంధానంగా సీఆర్ డీఏ పరిధిలో ఉంటాయి.
7) సదరన్(దక్షిణ) జోన్ : గుంటూరు సిటీతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను ఈ జోన్‌లో చేర్చారు. దీంతో గుంటూరు నగరంలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంటు స్థానం కూడా ఈ పరిధిలోకి వస్తుంది.
8) సౌత్ ఈస్ట్ (ఆగ్నేయ)జోన్ : బాపట్ల, గుంటూరు జిల్లాల పరిధిలోని డెల్టా ప్రాంతాలను ఈ జోన్‌లో చేర్చారు.
మరిన్ని విషయాలు..
+ సీఆర్‌డీఏ పూర్తి విస్తీర్ణం: 8,352.69 చదరపు కిలోమీటర్లు.
+ అమరావతి నగర విస్తీర్ణం: 217 చదరపు కిలోమీటర్లు.
+ జిల్లాల పరిధి: గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
