ఏపీలో అధికార కూటమికి సారధ్యం వహిస్తున్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో బుధవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓ కొత్త పదవిని ప్రకటించిన పార్టీ అధిష్ఠానం ఆ పదవిని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న మంత్రి నారా లోకేశ్ కు అప్పగించింది.
ఈ మేరకు పార్టీ నుంచి ఓ కీలక ప్రకటన వెలువడింది. పార్టీలో కొత్తగా కార్యనిర్వాహక అధ్యక్ష (వర్కింగ్ ప్రెసిడెంట్) పదవిని ప్రకటించిన పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… ఆ పదవిని తన కుమారుడు, తన కేబినెట్ లో కీలక మంత్రిగా కొనసాగుతున్న నారా లోకేశ్ కు అప్పగించారు.
నారా లోకేశ్ ప్రస్తుతం పార్టీలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శితో పాటుగా పార్టీ సంక్షేమ నిధి సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లోకేశ్… 2024 ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించారు.
చంద్రబాబును జగన్ సర్కారు అరెస్టు చేసి జైలులో పెట్టినా… ధైర్యం కోల్పోని లోకేశ్… జగన్ సర్కారుపై న్యాయ పోరాటం చేశారు. జగన్ సర్కారు సాగిస్తున్న దౌర్జన్యకాండ పాలతో చెల్లాచెదురు అయిన పార్టీ కేడర్ ను ఒక్కదరికి చేర్చడంలో ఆయన సఫలీకృతులయ్యారు. మొత్తంగా పార్టీలో తిరుగులేని నేతగా ఓ స్పెషల్ ఇమేజీని ఆయన సంపాదించకున్నారు.
చంద్రబాబు తర్వాత పార్టీ అధ్యక్షుడిగా నారా లోకేశేనన్న వాదనలు బలంగా వినిపించాయి. లోకేశ్ ను కాదనే నేత దాదాపుగా పార్టీలో ఏ ఒక్కరూ లేరని చెప్పాలి. ఇదేదో చంద్రబాబు కుమారుడిగా కాకుండా పార్టీ పటిష్టత కోసం, పార్టీ కార్యకర్తలకు అండాదండగా నిలిచి మరీ లోకేశ్ ఈ ఇమేజీని సంపాదించుకున్నారని చెప్పాలి.
పార్టీ విపక్షంలో ఉండగా… కార్యకర్తల పక్షాన ఏ రీతిన నిలబడ్డారో, పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా ఆయన అదే పంథాలో కొనసాగుతున్న తీరు ఆయనలోని కొత్త నాయకుడిని బయటకు తీసుకువచ్చింది. ఇక లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆయనలోని నిజమైన సామర్ధ్యాన్ని బయటపెట్టింది.
ఇప్పటికే జాతీయ వ్యవహారాలను తనదైన శైలిలో చక్కబెడుతూ సాగుతన్న లోకేశ్… ఢిల్లీలో పార్టీకి కూడా ఓ మంచి హైప్ తీసుకుని వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర కేబినెట్ లోని దాదాపుగా అందరు మంత్రుల వద్ద తనదైన శైలి సత్తా చాటిన లోకేశ్…వారితో సమావేశాల కోసం వారి అపాయింట్ మెంట్ల కోసం వేచిచూసే అవసరాన్ని లోకేశ్ ఎప్పుడో పక్కనపెట్టేశారు. తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాతో లోకేశ్ మరింతగా జాతీయ రాజకీయాల్లో సత్తా చాటేందుకు అవకాశం దక్కినట్టైందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates