క‌విత‌కు భ‌య‌ప‌డుతున్నారా?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలైనా ఎదుర‌వుతాయి. ఏకు మేకైన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అలానే.. ఇప్పు డు బీఆర్ఎస్ పార్టీకి.. అదే పార్టీ మాజీ నాయ‌కురాలు, మాజీ ఎంపీ క‌విత కంట్లో న‌లుసుగా మారారు. కొత్త‌ పార్టీ ఏర్పాటు ద్వారా.. బీఆర్ ఎస్‌ను ల‌క్ష్యంగా చేసుకునే ప్ర‌య‌త్నాల్లో ముందున్నారు. ఈ క్ర‌మంలో ఏకంగా బీఆర్ ఎస్ పార్టీని బ‌ల‌హీన ప‌ర‌చ‌డం ద్వారా తాను ఎద‌గాల‌న్న వ్యూహాల‌తో క‌విత ముందుకు సాగుతున్నారు.

ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే గ‌తంలో `టీఆర్ ఎస్`గా ఉన్న బీఆర్ ఎస్ పార్టీ పేరును త‌ను తీసుకునేందుకు క‌విత రెడీ అయ్యారన్న వార్త‌లు వ‌చ్చాయి. ఆమే స్వ‌యంగా “ఇప్పుడు టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉంది. ఎవ‌రైనా దీనిని తీసుకోవ‌చ్చు.. వాడుకోవచ్చు“ అన్నారు. ఈ ప‌రిణామం బీఆర్ ఎస్ పార్టీకి శ‌రాఘాతంగా మార‌నుంది. అంటే.. క‌విత పెట్టే కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్ అయితే.. అది బీఆర్ ఎస్ పార్టీని బ‌లంగా దెబ్బ‌తీసే ఆయుధంగా మారిపోతుంది. దీనిపై ఇప్ప‌టికే త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డ్డ బీఆర్ ఎస్ నాయ‌కులు వెంట‌నే వ్యూహాల‌కు ప‌దును పెట్టారు.

టీఆర్ ఎస్ పార్టీ పేరును ఎవ‌రికీ కేటాయించ‌వ‌ద్ద‌ని ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పిటిష‌న్ ఇచ్చారు. అక్క‌డ ఏమైందో ఏమో.. ఇప్పుదు తామే మ‌ళ్లీ టీఆర్ఎస్‌గా మారుతామంటూ.. కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అంటే.. బీఆర్ ఎస్ పేరును వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి లేదా అంత‌కంటే ముందుగానే.. `టీఆర్ ఎస్‌`గా మార్చే ప్ర‌య‌త్నాలు చేయ‌నున్నార‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది. అంటే.. ఇది ఒక‌ర‌కంగా.. క‌విత‌కు భ‌య‌ప‌డుతున్నట్టేనా?  అంటే.. సందేహం లేద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

బ‌ల‌మైన ప్ర‌జాద‌ర‌ణ‌..

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఏ ముహూర్తంలో కేసీఆర్ .. టీఆర్ ఎస్ పార్టీకి అంకురార్ప‌ణ చేశారో.. కానీ, ఆ పేరు ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిపోయింద‌నే చెప్పాలి. ఇప్ప‌టికీ గ్రామీణ ప్రాంతాల‌లో టీఆర్ఎస్ గానే ముద్ర కొన‌సాగుతోంది. కేసీఆర్‌-టీఆర్ ఎస్‌.. ఈ రెండు తెలంగాణ‌తో విడదీయరాని బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అలాంటి పేరును ఇప్పుడు క‌విత సొంతం చేసుకుంటే.. గుండుగుత్త‌గా బీఆర్ ఎస్ దుకాణం బంద్ అయిపోతుంద‌న్న చ‌ర్చ ఉంది. అందుకే.. ఇప్పుడు బీఆర్ ఎస్‌ను తిరిగి టీఆర్ ఎస్‌గా మార్చుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నార‌న్న చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది.