తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాటజీకి తెరదీశారు. త్వరలోనే జిల్లాల విభజన చేయనున్నట్టు ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం జన గణన ప్రారంభమైన నేపథ్యంలో దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయని.. తద్వారా.. విభజన సాధ్యం కాదని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మధ్యలో లేదా.. చివరలో జిల్లాల సరిహద్దులను మార్చడం ఖాయమని వ్యాఖ్యానించారు. దీనిపై ఇప్పటికే తనకు ఎంతో రిప్రజెంటేషన్లు ఇచ్చారన్న రేవంత్ రెడ్డి.. పరిశీలన కూడా పూర్తయిందని, అయితే.. కేంద్రం ఇప్పుడు జనగణన చేస్తున్న క్రమంలో సరిహద్దులు మార్చేందుకు వీల్లేదని పేర్కొన్నారు.
అశాస్త్రీయంగా..
ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. వాస్తవానికి రాష్ట్ర విభజన సమయానికి మొత్తం 10 ఉమ్మడి జిల్లాలు మాత్రమే ఉన్నాయి. దీంతో పాలనా సౌలభ్యం పేరుతో నాటి కేసీఆర్ ప్రభుత్వం 2016-17 మధ్య కాలంలో జిల్లాలను విభజించింది. ఏకంగా తొలుత 28 జిల్లాలను ప్రతిపాదించింది. ఆ తర్వాత.. పలు జిల్లాల నుంచివచ్చిన డిమాండ్లను ప్రతిపాదిస్తూ.. మరో 5 జిల్లాలను ఏర్పాటు చేసింది. మొత్తంగా ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నాయి. అయితే.. అప్పట్లో కేసీఆర్ చేసిన విభజనను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా తప్పుబట్టారు. అశాస్త్రీయంగా విభజించారని.. తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను జిల్లాలుగా ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు.
ఇప్పుడు ఏం చేస్తారు..
గత 2023 ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ జిల్లాల విభజనపై హామీ ఇచ్చింది. ప్రజల ఆకాంక్షలు.. వారి కోరికలను దృష్టిలో పెట్టుకుని తాము అధికారంలోకి వచ్చాక.. జిల్లాలను పునర్విభజిస్తామని.. అశాస్త్రీయంగా జరిగిన అనేక జిల్లాల విభజనను మారుస్తామని చెప్పింది. దీనిలో భాగంగానే ఆయా జిల్లాల నుంచి ఇప్పటికీ డిమాండ్లు వినిపిస్తున్నాయి. గత ఏడాది ఐఏఎస్ అధికారుల నుంచి కూడా రిపోర్టులు తెప్పించుకున్నారు. అయితే.. ఇంతలోనే కేంద్ర గణాంక శాఖ జనగణనకు తెరదీసింది. ఈ క్రమంలో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. 2028 చివరి నాటికి.. గణన పూర్తవుతుంది. కాబట్టి.. ఆ సమయానికి జిల్లాలను విభజించే అవకాశం కాంగ్రెస్‌కు దక్కుతుంది.
వ్యూహాత్మకంగానే..
ఇప్పుడు కూడా జిల్లాల విభజన వెనుక వ్యూహాత్మక ధోరణే ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలు.. లేని ప్రాంతాలు అనేవాటిని విభజించడం.. లేదా.. నిజమైన అభివృద్ధి కోసమే అయితే.. ఖచ్చితంగా ఇప్పుడు వెనుకబాటులో ఉన్నవాటిని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయడం వంటివి చేస్తారని చెబుతున్నారు. ఏదేమైనా.. ఎవరు అధికారంలో ఉన్నా.. రాజకీయ ప్రభావం అయితే.. జిల్లాల విభజనపై ఖచ్చితంగా ఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates