ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం ఏమంటే.. వాషింగ్టన్ డీసీ చరిత్రలో తొలిసారి మేయర్ ఎన్నికల బరిలో దక్షిణాసియాకు చెందిన ఒకమహిళ నిలిచారు. మరో ఆసక్తికర అంశం ఏమంటే.. ఆమె తమిళ మూలాలున్న 31 ఏళ్ల యువతి. ఆమె పేరు.. రిని సంపత్. తమిళనాడులోని తేని ప్రాంతంలో పుట్టిన రిని సంపత్.. తన ఏడేళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వచ్చారు. ఇప్పుడు మేయర్ గా బరిలోకి దిగేందుకు అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేశారు.
పెద్దగా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లోని రిని.. మేయర్ ఎన్నికల్లో పోటీ చేయటానికి అవసరమైన నామినేషన్ అర్హతను ఇట్టే సాధించటమే ఒక పెద్ద విజయంగా చెప్పాలి. మన మాదిరి కాకుండా.. ఇక్కడ మేయర్ ఎన్నిక కాస్త భిన్నంగా ఉంటుంది. తొలుత పార్టీకి చెందిన మేయర్ అభ్యర్థులతో పోటీ పడాల్సి ఉంటుంది. అందులో 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించాల్సి ఉంటుంది. అప్పుడు మేయర్ ఎన్నికల్లో పార్టీ తరఫు అభ్యర్థిగా బరిలోకి దిగుతారు. కాకుంటే.. వాషింగ్టన్ డీసీ పూర్తిగా డెమొక్రాట్ల కంచుకోట కావటంతో.. ఆమె కానీ ప్రైమరీలో విజయం సాధిస్తే.. మేయర్ అయినట్లేనని చెబుతున్నారు.
ఫిక్స్ ది బేసిక్స్ .. కొత్త డీసీ (న్యూ డీసీ) నినాదాలతో పలువురిని ఆకర్షిస్తున్నారు. ఈ ఎన్నికల బరిలో దిగే విషయంలో ఆమె సాధించిన అతి పెద్ద విజయం ఏమంటే.. ప్రైమరీలో పోటీ చేయాలంటే 4500 మంది మద్దతుదారుల సంతకాలు అవసరం. దీన్ని ఆమె నాలుగు వారాల్లో పూర్తి చేశారు. దీంతో.. వాషింగ్టన్ డీసీ డెమొక్రాట్ల ప్రైమరీ బ్యాలెట్ పేపర్ లో తన పేరు వచ్చేలా చేసుకోవటం సక్సెస్ అయ్యారు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఆమె.. స్వల్ప వ్యవధిలో తనదైన ముద్ర వేయటం ఆసక్తికరంగా మారింది. దీంతో రినీ సంపత్ పలువురిని ఆకర్షిస్తున్నారు.
మిగిలిన రాజకీయ నేతల మాదిరి పెద్ద పెద్ద హామీలు ఇవ్వని ఆమె చాలా చిన్నవి.. బేసిక్ గా ఉండే అంశాల మీదా.. మౌలిక సదుపాయాలను ప్రస్తావిస్తూ.. ఆ సమస్యల్ని పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నారు. వాషింగ్టన్ డీసీలో ఉన్న రోడ్ల రిపేర్లు.. గుంతలు పూడ్చటం.. తక్కువ ఖర్చుతో జీవనం గడిచేలా చేయటం.. అత్యవసర సేవల వేగాన్ని మెరుగుపర్చటం లాంటి ప్రాథమిక అంశాల మీద ఫోకస్ చేస్తానని చెబుతున్నారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె సైబర్ సెక్యూరిటీ నిపుణురాలిగా పని చేయటంతో పాటు.. ప్రభుత్వ కాంట్రాక్టర్ గా పని చేశారు.
మేయర్ ఎన్నికలకు ముందస్తుగా జరిగే ఈ ప్రైమరీ ఎన్నికల పోలింగ్ జూన్ 16న జరగనుంది. అందులో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన వారు ప్రధాన ఎన్నికలకు వెళతారు. ఆ ప్రధాన ఎన్నిక ఈ ఏడాది నవంబరు 3న జరగనుంది.
రినీ సంపత్ బ్యాక్ గ్రౌండ్ ను చూస్తే.. ఆమె కాలేజీ స్టూడెంట్ గా ఉన్నప్పుడు స్టూడెంట్ బాడీ ప్రెసిడెంట్ గా పని చేశారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఆమె విద్యాభ్యాసం చేశారు. కమ్యూనికేషన్స్ లో పట్టా సాధించిన ఆమె.. పదేళ్లుగా వాషింగ్టన్ డీసీలో ఉంటున్నారు. బరాక్ ఒబామా హయాంలో నేషనల్ క్యాంపస్ లీడర్ షిప్ కౌన్సిల్ లో అసోసియేట్ పాలసీ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు.
ఇక.. ప్రైమరీ ఎన్నికల్లో రినీ సంపత్ కు కలిసి వచ్చే అంశం.. ప్రస్తుత మేయర్ మురియల్ బౌజర్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవటం. ఇప్పటికే మూడుసార్లు పోటీ చేసిన అనుభవం ఉన్న ఆయన నాలుగోసారి పోటీకి నో చెప్పేశారు.
ఈసారి జరుగుతున్న ప్రైమరీ ఎన్నికలు గతానికి భిన్నంగా.. ప్రాధామ్యాల ప్రకారం.. అంటే మన దగ్గర జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరి నిర్వహిస్తారు. ప్రతి ఓటరు ఐదుగురికి ఓటు వేసే వీలుంది. అందులో ఎవరికైతే తొలుత 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తే వారే మేయర్ కావటం ఖాయమని చెప్పొచ్చు. వాషింగ్టన్ డీసీలో సుమారు 5.29 లక్షల మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారు. డీసీలో క్లోజ్డ్ ప్రైమరీ విధానం ఉన్న నేపథ్యంలో రినీ సంపత్ పోటీ చేస్తున్న డెమొక్రాట్ల ప్రైమరీలో ఆ పార్టీకి చెందిన ఓటర్లే ఓటు వేసే వీలు ఉంది. ప్రస్తుతం సుమారు 3.96 లక్షల మంది డెమొక్రాటిక్ ఓటర్లు ఉన్నారు.
గత ఎన్నికల్ని చూస్తే..ప్రైమరీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది. గత ఎన్నికల్లో కేవలం 32 శాతమే ఓట్లు నమోదయ్యాయి. ఇక.. రినీ సంపత్ కు ఉన్న సానుకూలాంశాలు.. ప్రతికూలాంశాల్ని చూస్తే..
రినీ సంపత్ ప్రస్తుతానికి ఒక వ్యూహాత్మక అభ్యర్థిగా క్యాంపెయిన్ జరుగుతోంది. కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే 4500 మంది ఓటర్ల సంతకాలు సేకరించి మేయర్ బ్యాలెట్ మీద చోటు సాధించటం ఒక గొప్ప విజయంగా చెబుతున్నారు. ఈ నగర చరిత్రలో ఒక దక్షిణాసియాకు చెందిన మహిళా ఇలా జరగటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. అనుభవం ఉన్న రాజకీయ నాయకులు ఆమెకు బలంగా మద్దతు ఇస్తున్నారు. ప్రజల్లో మార్పు కోరుకునే తత్త్వం ఆమెకు సానుకూలాంశంగా చెబుతున్నారు. తాను రాజకీయ నాయకురాలిని కాదని.. ఒత్తిళ్లకు నలిగిపోవాల్సిన అవసరం లేదని.. తానో కొత్త ముఖాన్ని అని చెప్పుకోవటం కొంతలాభం చేకూరే అంశం.
పెద్ద పెద్ద హామీలు ఇవ్వకుండా.. నిత్యం ప్రజలు ఎదుర్కొనే సమస్యల్ని పరిష్కరించేందుకు బాధ్యత తీసుకుంటానని చెప్పటం ఆమెకు మేలు చేస్తుందని భావిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ నిపుణురాలిగా.. ఫెడరల్ కాంట్రాక్టర్ గా పని చేసిన అనుభవంతో ప్రభుత్వ విభాగాల్లో ఉన్న లోపాల్ని సరిదిద్దే శక్తి తనకు ఉందని చెబుతున్నారు. తన ప్రచారం ఎటువంటి కార్పొరేట్ సంస్థల నిధులపై కాకుండా సాధారణ ప్రజల మద్దతుతోనే నడుస్తుందని ఆమె చెబుతున్నారు. ఇప్పటికే 15వేల డాలర్లకు (రూ.13.91 లక్షలు) పైనే విరాళాలు సేకరించటం ఆమెకున్న మరో బలంగా పేర్కొంటున్నారు. అమెరికా రాజకీయాల్లో పెరుగుతున్న భారత సంతతి ప్రాబల్యం.. స్థానికంగా ఉన్న వలసదారుల మద్దతు ఆమెకు అదనపు బలంగా మారుతుందని చెబుతున్నారు.
సానుకూలాంశాలు ఇన్ని ఉంటే.. ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. వాటిల్లోకి వెళితే.. తాను పక్కా రాజకీయ నేతను కాదని చెప్పటం బలమని చెబుతున్నా.. ఆమె ప్రత్యర్థులు ఆ అంశాన్ని బలహీనతగా చెబుతున్నారు. ఆమె ప్రత్యర్థుల్లో పలువురికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. పోలింగ్ వేళకు ఓటర్లు అనుభవం వైపు మొగ్గితే ఆమెకు ఇబ్బందిగా మారుతుంది. ఆమె ప్రత్యర్థులకు స్థానిక యూనియన్లు.. పార్టీ నేతల మద్దతు ఉండగా.. రినీ సంపత్ కు ఎలాంటి ప్రత్యేక గ్రూపుల మద్దతు లేదు. ఇది ఆర్థికంగా సవాలుగా మారుతుందని చెబుతున్నారు.
విరాళాల సేకరణ కూడా గెలుపులో కీలకంగా మారుతుందన్నది మర్చిపోకూడదు. ఇక్కడి మేయర్ ఎన్నికల్లో ఇప్పటివరకు ఎప్పుడూ దక్షిణాసియా అభ్యర్థి గెలిచింది లేదు. ఒక కొత్త ముఖాన్ని ఓటర్లు అంగీకరిస్తారా? అన్నది పెద్ద ప్రశ్న. దీనికి తోడు తొలిసారి అమల్లోకి వచ్చిన ఎన్నికల విధానం (ప్రాధాన్యత క్రమం..అదేనండి మన ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరి) ఓటర్లలో కొంత గందరగోళానికి కారణమవుతుందని చెబుతున్నారు.
అయితే.. ఈ సవాళ్లను అధిగమించే కొన్ని సానుకూలతలు ఆమెకు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి రెండు. ఒకటి.. భారత సంతతి ప్రజల నుంచి దక్షిణాసియా వర్గాల నుంచి మద్దతు. గతంలో విద్యార్థి ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉండటంతో యువ ఓటర్లు.. పూర్వ విద్యార్థుల నెట్ వర్కు ఆమెకు సపోర్టు చేస్తున్నారు. ఇది కూడా ఆమెకు కొంత పాజిటివ్ అంశంగా చెప్పొచ్చు. మరి.. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates