తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పార్టీ పేరు, సిద్ధాంతాలను ఈ నెల 25 ప్రకటిస్తానని కూడా ఆమె ఇదివరకే వెల్లడించారు. తాజాగా శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె చేసిన వ్యాఖ్యలతో ఆమె పార్టీ పేరు ఏమిటన్న విషయం దాదాపుగా వెల్లడైనట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరు ఆమె తన పార్టీ పేరుగా ప్రకటించడం ఖరారైపోయినట్టేనని చెప్పాలి.
ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీ గురించి మాట్లాడేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కవిత… మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మీ పార్టీ పేరిమిటి? అన్న ప్రశ్నకు ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చారు. టీఆర్ఎస్ అన్న పేరు ఇప్పుడు ఫ్రీ అయ్యిందని, దానిని ఇప్పుడు ఎవరైనా తీసుకోవచ్చని, అది ఇప్పుడు ఓపెన్ గానే ఉందని కవిత అన్నారు. అంతేకాకుండా పాత పేరు, కొత్త అజెండాతో తాను వస్తున్నానని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం బీఆర్ఎస్ గా కొనసాగుతున్న పార్టీ పేరు గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అన్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పేరు తెలంగాణ వాదులను ఐక్యం చేయడంతో పాటు ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది. చివరాఖరుకు తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగానూ సాధించింది. అయితే ఒక లక్ష్యంగా ప్రారంభమైన టీఆర్ఎస్ తన లక్ష్యాన్ని సాధించిందని, దానిని ఇక దేశవ్యాప్తం చేయాలన్న భావనతో దాని పేరును భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మార్చేశారు. ఈ మార్పుపై తెలంగాణ వాదులతో పాటు రాజకీయ విశ్లేషకులు పెదవి విరచారు. వారి వాదన కరెక్టేనన్నట్లుగా బీఆర్ఎస్ గా మారిన తర్వాత కేసీఆర్ పార్టీ ఓటమి చవిచూసింది.
కేసీఆర్ కుటుంబంలో జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కవిత… కొత్త రాజకీయ పార్టీని స్థాపించే దిశగా సాగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ కు అనుబంధంగా కవిత ప్రారంభించిన తెలంగాణ జాగృతి ఆమె పార్టీ పేరుగా ఉంటుందని అంతా భావించారు.
అయితే ఊహించని విధంగా టీఆర్ఎస్ పేరుపై దృష్టి సారించిన కవిత…అదే పేరును తన పార్టీ పేరుగా ప్రకటించేందుకు దాదాపుగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 25న కవిత నోట నుంచి ఆమె పార్టీ పేరు టీఆర్ఎస్ అని వినిపించడం ఖాయమన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
