ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని కలిపి కొత్త రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.
మచిలీపట్నం నుంచి విజయవాడకు సుమారు 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు 40 కిలోమీటర్లు ఉండగా, ఈ మూడు నగరాలను కలిపే 110 కిలోమీటర్ల జాతీయ రహదారి పరిధిని మొత్తం క్యాపిటల్ ఏరియాగా ప్రకటించాలని సూచించారు. ఈ సమగ్ర ప్రాంతానికి ‘మావిగన్’ అనే పేరును ప్రతిపాదించారు.
తక్కువ బడ్జెట్‌తోనే ఈ ప్రాంతాన్ని రాజధాని తరహాలో అభివృద్ధి చేయవచ్చని పేర్కొంటూ, సుమారు రూ.2 లక్షల కోట్ల అంచనాలో కేవలం 10 శాతం పెట్టుబడితోనే గ్రోత్ ఇంజిన్‌లాంటి రాజధాని నిర్మించవచ్చని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి వేగం తీసుకురావాలంటే మౌలిక వసతులు సిద్ధంగా ఉన్న ప్రాంతాన్ని వినియోగించుకోవడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం అమరావతి అంశంపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ప్రత్యామ్నాయ దృక్పథంగా ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు జగన్ తెలిపారు. ఇప్పటికే రహదారులు, పట్టణాల అనుసంధానం, పారిశ్రామిక అవకాశాలు ఉన్న ఈ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు.
అయితే ‘మావిగన్’ అనే పేరుపై వివిధ అభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని, అవసరమైతే వేరే పేరు కూడా పరిశీలించవచ్చని స్పష్టం చేశారు. ప్రజల అభిప్రాయాలు, నిపుణుల సూచనలు తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
