హర్మూజ్ ప్లాన్ బెడిసికొట్టిందా ట్రంప్?

అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని మహా అయితే మూడు వారాల్లో ముగించేసి.. తాను అనుకున్నది పూర్తి చేసి.. విజయాన్ని ఏకపక్షంగా ఎంజాయ్ చేద్దామనుకున్న సంగతి తెలిసిందే. ఇరాన్ పై విజయం తర్వాత తనను తాను తిరుగులేని అధికార కేంద్రంగా మార్చుకొని.. తన ఎజెండాలో మిగిలిన అంశాల మీద ఫోకస్ చేద్దామని భావించారు. అందుకు భిన్నంగా పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే.

ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం సుదీర్ఘంగా సాగటం.. హర్మూజ్ జలసంధి విషయంలో పరిస్థితులు అంతకంతకూ క్లిష్టంగా మారిన  నేపథ్యంలో.. ఇదే పరిస్థితిని కంటిన్యూ చేస్తే.. తనకు మరిన్ని తిప్పలు తప్పవన్న యోచనలో ట్రంప్ ఉన్నారా? అలా అని వాస్తవాన్ని ఒప్పుకోవటం ఆయనకు సుతారం ఇష్టం ఉండదు కాబట్టి.. తన ప్రయోజనాల్ని.. పరిధిని కొంత పరిమితం చేసుకొని యుద్ధం నుంచి బయటకు వెళ్లిపోవాలని భావిస్తున్నారా? అంటే అవునన్న వాదన వినిపిస్తోంది.

దీనికి బలం చేకూరే సంచలన కథనాన్ని వాల్ స్ట్రీట్ జనరల్ పబ్లిష్ చేసింది. గడిచిన కొన్ని రోజులుగా ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యల్లోని అసలు విషయాల్ని ప్రస్తావిస్తూ.. యుద్ధం మీద ట్రంప్ ప్రస్తుతం ఎలాంటి మైండ్ సెట్ తో ఉన్నారన్న విషయాలకు సంబంధించి వ్యూహాల్ని ప్రస్తావించింది. ఇరాన్ పై యుద్ధం మూడు వారాలు లేదంటే నాలుగు నుంచి ఆరు వారాల్లో ఖాయంగా ముగుస్తుందని భావించారు.

అయితే.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండటం.. ఎప్పటికి ముగుస్తుందో అర్థం కానట్లుగా పరిస్థితులు ఉన్నాయి. ఇక.. హార్మూజ్ జలసంధి విషయంలో చిక్కుముడులు పెరగటం.. దీన్ని తెరిచేందుకు ప్రయత్నిస్తే మరిన్ని ఉద్రిక్తతలు పెరగటం ఖాయమన్న పరిస్థితి.
దీనికి తోడు నాటో మిత్రదేశాలను తనకు తోడుగా రావాలని ట్రంప్ కోరినా.. వారి నుంచి సానుకూల స్పందన లేని పరిస్థితి.

దీంతో.. ట్రంప్ లో అసహనం అంతకంతకూ పెరుగుతున్న పరిస్థితి. ఇది ఇప్పటికే ఆగ్రహంగా మారినా.. ఆయన నోటికి పని చెప్పటం తప్పించి ఇంకేమీ చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇరాన్ నౌకాదళాన్ని.. రక్షణ వ్యవస్థల్ని.. క్షిపణి తయారీ.. అణుశుద్ధి సామర్థ్యాల్ని పూర్తిగా దెబ్బ తీసే ప్రధాన లక్ష్యాల్ని పూర్తి చేసి..యుద్ధం నుంచి వైదొలగాలనన ఆలోచనల్లో ఆయన ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో హార్మూజ్ జలసంధిని తెరిపించే కార్యక్రమాన్ని మీద వేసుకోకూడదన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధాన్ని ముగించి.. తర్వాత హార్మూజ్ నుంచి వాణిజ్యాన్ని పునరుద్ధరించేలా ఇరాన్ పై దౌత్యపరమైన ఒత్తిడి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఈ వాదనకు తగ్గట్లే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తాజా వ్యాఖ్యలు ఉండటాన్ని ప్రస్తావిస్తున్నారు.

అమెరికా లక్ష్యం మరికొన్ని వారాల్లో పూర్తవుతుందని.. తర్వాత హార్మూజ్ ను పూర్తిగా తెరవటమా? పలుదేశాల కూటమి ఆధ్వర్యంలో నౌకా రవాణా స్వేచ్ఛగా జరిగేలా చూడటమా? అన్నది ఇరాన్ కు వదిలేస్తామని వ్యాఖ్యానించటంలోని అసలు ఉద్దేశం ఇదేనంటూ తన కథనంలో పేర్కొంది.