వైసీపీ రెడీనా: స్థానికంలో సత్తా ఎంత..!

స్థానిక ఎన్నికలకు మరో మూడు నాలుగు నెలలే ఉన్నాయి. ఎప్పుడో 2029లో జరిగే ఎన్నికలపై దృష్టి పెట్టిన వైసీపీ అధినేత జగన్.. స్థానికంలో విజయం పై మాత్రం పెద్దగా స్పందించడం లేదు. 2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లో అప్పట్లో అధికారంలో ఉన్న కారణంగా వైసీపీ భారీ విజయం దక్కించుకుంది. కొన్నికొన్ని జిల్లాల్లోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో అసలు వేరే పార్టీ నాయకులను నామినేషన్ కూడా వేయకుండా అడ్డుకున్నారన్న చర్చ ఉంది.

ఫలితంగా మెజారిటీ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు కూడా గుండుగుత్తగా వైసీపీకి చిక్కాయి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకవైపు టీడీపీ, జనసేన భారీ ఎత్తున స్థానిక ఎన్నికల్లో విజయం పై కసరత్తును ముమ్మరం చేశాయి. ఎట్టి పరిస్థితిలోనూ విజయం దక్కించుకుని తీరాలని నిర్ణయించాయి. తద్వారా విజయం తమ సొంతం అవుతుందని భావిస్తున్నాయి. ముఖ్యంగా కూటమి కట్టుబాటు విషయంలో మరింత గట్టిగా ముందుకు సాగుతున్నారు.

నాయకులు కలివిడిగా ఉండాల్సిందేనని.. ఎట్టి పరిస్థితిలోనూ స్థానిక ఎన్నికల్లో విజయం దక్కించుకుని తీరాలని కూడా చెబుతున్నారు. తద్వారా క్షేత్రస్థాయిలో వైసీపీకి గెలుపు అంత ఈజీ కాదన్నది స్పష్టమవుతోంది. పైగా పెట్టుబడులు, సంక్షేమం వంటి విషయాలపై ప్రజలకు అవగాహన పెంచడం ద్వారా కూటమికి సానుకూల పవనాలు వీచేలా కూడా చేస్తున్నారు. దీంతో విజయం పై ధీమాతోనే కూటమి పార్టీలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో స్థానికంలో వైసీపీ విజయం దక్కించుకోవాలంటే బలమైన పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంతేకాదు ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉంది. నాయకులను బలోపేతం చేయడం, పార్టీలో అంతర్గత కుమ్ములాటలను తగ్గించడం, నాయకులను ఉత్తేజ పరచడం వంటివి పార్టీకి ఇప్పుడు తక్షణ అవసరాలుగా మారాయి. కానీ జగన్ మాత్రం వచ్చే సార్వత్రిక ఎన్నికలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. మరి స్థానికంపై ఎప్పుడు ఆలోచన చేస్తారో చూడాలి.