మతం మారితే ఎస్సీ హోదా రద్దు… సంచలన తీర్పు

భారత దేశంలో కులం, మతం వంటి విషయాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. విద్య, ఉద్యోగం, సామాజిక హోదాలకు కులం, మతం ప్రాతిపదిక. అయితే, ఒక కులం నుంచి మరో కులంలోకి మారిన సందర్భంలో ఎదురయ్యే సమస్యల గురించి చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా క్రిస్టియానిటీలోకి మారిన షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తులకు ఎస్సీలకు లభించే హక్కులు లభించడంపై చాలా ఏళ్లుగా పెద్ద చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది.

క్రిస్టియానిటీలోకి మారిన ఎస్సీలు ఎస్సీ హక్కులు పొందలేరని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. హిందూ, బౌద్ధం, సిక్కు మతాలకు కాకుండా ఇతర మతాల్లోకి మారిన వారు ఎస్సీ హక్కులు కోల్పోతారని దేశపు అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఎస్సీలు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. ఏపీ హైకోర్టు తీర్పుపై దాఖలైన పిటిషన్ ను విచారణ జరిపిన జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ అంజరియా ధర్మాసనం సంచలన ఆదేశాలు జారీ చేసింది.

అదే సమయంలో మతం మారితే కుల సర్టిఫికెట్ రద్దు కాకపోయినా  చట్టం వర్తించదని స్పష్టం చేసింది. సర్టిఫికెట్ ఉంది కనుక రక్షణ కల్పించలేమని క్లారిటీనిచ్చింది. పాస్టర్ ఆనంద్ పాల్ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఆనంద్ పాల్ దశాబ్దానికి పైగా క్రిస్టియన్ గా ఉన్నారని, తిరిగి ఎస్సీ కమ్యూనిటీలో చేరలేదని చెప్పింది. ఒకవేళ ఆయన ఎస్సీ కమ్యూనిటీలో తిరిగి చేరారని నిరూపిస్తే పాత హోదా సాధ్యం అవుతుందని తెలిపింది.