“ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ హయాంలో కుట్రలు చేశారు. దీనిని శ్మశానం అని గేలి చేశారు” అని సీఎం చంద్రబాబు గత ఆదివారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఈ కుట్రలు ఇంకా ఆగలేదన్న అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. వరుసగా అమరావతిలో భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం దీనికి ఉదాహరణగా చర్చ జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్‌గా దృష్టి పెడుతోంది.
సోమవారం అర్ధరాత్రి అమరావతి రాజధాని ప్రాంతంలో భారీ నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణ సామగ్రిని నిల్వ చేసిన ప్రదేశంలో మంటలు చెలరేగి భారీ నష్టాన్ని కలిగించాయి. సుమారు రెండున్నర గంటల పాటు మంటలు ఎగిసిపడ్డాయని అధికారులు తెలిపారు. ప్లాస్టిక్ సామగ్రి ఎక్కువగా ఉండటంతో మంటలు మరింతగా వ్యాపించాయని చెప్పారు. దాదాపు 3 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా.
కోర్ క్యాపిటల్ ఏరియా రాయపూడిలో ప్రభుత్వ అధికారుల భవనాల నిర్మాణం జరుగుతోంది. వాటికి సంబంధించిన నిర్మాణ సామగ్రిని అక్కడ నిల్వ చేశారు. సోమవారం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.
ఇదిలా ఉండగా, గత వారం ఇదే రాజధాని ప్రాంతంలోని వెలగపూడి సమీపంలో ఒక కంపెనీకి చెందిన నిర్మాణ సామగ్రికి కూడా నిప్పు అంటుకుని భారీ ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో దాదాపు 2 కోట్ల రూపాయల సరుకు దగ్ధమైంది.
ఈ అగ్ని ప్రమాదాలపై ప్రభుత్వం సీరియస్ అవుతోంది. గత ఘటనపై ఇప్పటికే విచారణ కమిటీని నియమించింది. విచారణ ప్రారంభమయ్యేలోపే తాజాగా రాయపూడిలో మరో పెద్ద ప్రమాదం చోటు చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరిగిందని, అమరావతి బ్రాండ్‌ను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోందని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి.
వాస్తవానికి అమరావతి ప్రాంతంలో రాత్రి 11 తర్వాత, అది కూడా నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశాల్లో ఎవరూ ఉండరనే కోణంలో చూస్తే ఇది కుట్రేనని టీడీపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజా ఘటనపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
