ఫ‌లించ‌ని బిజ్జ‌గింపులు.. జీవ‌న్ రెడ్డి `పంతం` ఇదే!

కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, జ‌గిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి.. పార్టీని వీడేందుకే సిద్ధ‌మ‌య్యారు. త్వ‌ర‌లోనే ఆయ‌న బీఆర్ ఎస్ పార్టీలో చేర‌నున్న‌ట్టు కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. బీఆర్ ఎస్ పార్టీ కూడా ఆయ‌న‌తో చ‌ర్చ‌లు పూర్తి చేసింద‌ని.. కేసీఆర్ కీల‌క ప‌ద‌విని ఆఫ‌ర్ చేశార‌ని.. మ‌ళ్లీప్ర‌భుత్వం ఏర్ప‌డితే.. మంత్రిప‌ద‌విని కూడా ఆఫ‌ర్ చేసిన‌ట్టు తెలిసింది. అయితే.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయ‌కత్వం.. తొలుత జీవ‌న్ రెడ్డి వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్‌గా తీసుకోలేదు.పైగా బీఆర్ ఎస్ నుంచి గెలిచి..త‌ర్వాత కాంగ్రెస్‌కు అనుకూలంగా మారిన సంజ‌య్ కుమార్ కే మొగ్గు చూపుతున్నారు.

దీంతో జీవ‌న్ రెడ్డి పార్టీని వీడేందుకు రెడీ అయ్యారు. ఇక‌, ఈ వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. సీరియ‌స్ అయిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల సీఎం రేవంత్ రెడ్డి స‌హా.. పార్టీరాష్ట్ర చీఫ్ మ‌హేష్‌కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లిన‌ప్పుడు.. సీనియ‌ర్ల‌ను కాపాడుకోవడం తెలియ‌దా? అని అగ్ర‌నేత రాహుల్‌గాంధీనే క్లాస్ తీసుకున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో జీవ‌న్ రెడ్డిని బుజ్జ‌గించేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. దీనిలో భాగంగా మంత్రి శ్రీధ‌ర్‌బాబు స‌హా.. ప‌లువురు నేతలు శ‌నివారం మ‌ధ్యాహ్నం నుంచి సాయంత్రం వ‌ర‌కు జీవ‌న్ రెడ్డితో చ‌ర్చ‌లు జ‌రిపారు.

కానీ, జీవ‌న్ మాత్రం ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌లేదు. తాను పార్టీ మార‌తాన‌నే ఆయ‌న తేల్చి చెప్పారు. అయితే.. ఈ చ‌ర్చ‌ల సంద‌ర్భం గా జీవ‌న్ రెడ్డి కీల‌క ష‌ర‌తు విధించార‌ని తెలిసింది. బీఆర్ ఎస్ త‌ర‌ఫున గెలిచిన సంజ‌య్‌కుమార్‌ను పార్టీలో చేర్చుకునేందుకు వీల్లేద‌ని.. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రించ‌డం కూడా స‌రికాద‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు.. నియోజ‌క‌వ‌ర్గంలో అధికారాల‌ను త‌న‌కు అప్ప‌గించాల‌ని కూడా జీవ‌న్ రెడ్డి తేల్చి చెప్పారు. అప్పుడు మాత్ర‌మే కొన‌సాగుతాన‌న్నారు. కానీ, ఈ విష‌యంలో పార్టీ నుంచి కానీ.. ప్ర‌భుత్వం నుంచి కానీ.. జీవ‌న్ రెడ్డికి స‌రైన హామీ ల‌భించ‌లేదు.

వాస్త‌వానికి సంజ‌య్‌ కుమార్‌ను ఇప్ప‌టికే పార్టీకి అనుబంధంగా మార్చుకున్న విష‌యం తెలిసిందే. పైగా ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వ్య‌వ‌హారాన్ని కూడా స్పీక‌ర్ తేల్చేశారు. అంతేకాదు.. జ‌గిత్యాల మునిసిపాలిటీలో సంజ‌య్ వ‌ర్గానికే చైర్మ‌న్ పోస్టు కూడా ఇచ్చారు. ఇంత జ‌రిగిన త‌ర్వాత‌.. ఇప్పుడు జీవ‌న్ చెబుతున్న‌ట్టుగా సంజ‌య్‌ను ప‌క్క‌న పెట్ట‌డం అనేది పార్టీ నాయ‌క‌త్వానికి సాధ్య‌మ‌య్యేది కాదు. ఈ నేప‌థ్యంలో జీవ‌న్‌నే బుజ్జ‌గించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ.. ఆయ‌న మాత్రం త‌న పంతం నెగ్గించుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదిలావుంటే.. ఈ నెల 25న బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు జీవ‌న్ రెడ్డి రెడీ అయిన విష‌యం తెలిసిందే.