వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండి పడ్డారు. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను జగన్ తన బంధువులైన రెడ్లకు రాసిచ్చేశారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు రాజకీయ కేంద్రాలకు ఆలవాలంగా మారిపోయాయన్నారు. రాజకీయ పునరావాస కేంద్రాలుగా పరిఢవిల్లాయని చెప్పారు. జగన్ జపం చేయడం తప్ప.. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు సాధించింది ఏమీ లేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పుల దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.
ఇటీవల ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌లో విద్యాశాఖకు కేటాయించిన నిధులు.. వాటిని ఎలా ఖర్చు చేయనున్నారన్న అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో మంత్రి లోకేష్ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ హయాంలో విద్యారంగాన్ని అన్ని విధాలా భ్రష్ఠు పట్టించారని దుయ్యబట్టారు. పాఠశాల విద్య నుంచి విశ్వవిద్యాలయాల వరకు అన్ని వ్యవస్థలను నాశనం చేశారని తెలిపారు. “ఎంత చెప్పుకొన్నా.. తరగని భ్రష్ఠత్వం“ అని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో జగన్ తన బంధు గణాన్ని తీసుకువచ్చి విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులుగా నియమించారని.. దీంతో వారు విద్యను వదిలేసి జగన్ జపం చేశారని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయా వివరాలను నారా లోకేష్ సభలో వివరించారు. 1) ఆంధ్రయూనివర్సిటీ ఉపకులపతిగా ప్రసాదరెడ్డిని నియమించారని తెలిపారు. జగన్ సమీప బంధువు సుందరవల్లిని శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ రెక్టార్ గా, విక్రమ సింహపురి వర్సిటీ వీసీగా నియమించారని చెప్పారు. అదేవిధంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతిగా శ్రీకాంత్ రెడ్డి, ఆర్కిటెక్చర్ వర్సిటీ ఉపకులపతిగా రామకృష్ణారెడ్డి, ఎస్వీయూ వర్సిటీ వీసీగా సురేంద్రనాథ్ రెడ్డిని నియమించారని తెలిపారు. కానీ, వీరికి ఆయా పోస్టుల్లో ఉండే అర్హత లేదని.. దీంతో విద్యార్థులే అప్పట్లో తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చిందని వివరించారు.
విగ్రహాలు పెట్టి..
అప్పట్లో జగన్ బంధువులు, ఆయన సామాజిక వర్గానికి చెందినవారు వీసీలుగా పదవులు పొందడంతో విశ్వవిద్యాలయాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి బొమ్మలు పెట్టేందుకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. దీనిని విద్యార్థులు అడ్డుకుంటే.. వారిపై కేసులు కూడా పెట్టారన్నారు. వర్సిటీల్లో ఫ్యాకల్టీ నియామకాలను గాలికొదిలేసి రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చారని దుయ్యబట్టారు.
ఏయూ వీసీగా ప్రసాదరెడ్డిని విద్యార్థులను రోడ్లపై నిలబెట్టారని తెలిపారు. ఫ్లెక్సీలు కట్టి వర్సిటీల పవిత్రతను దెబ్బతీశారని మండి పడ్డారు. అందుకే తాము అధికారంలోకివచ్చాక.. అర్హతను బట్టి వీసీలను నియమించామని.. ఎక్కడా పక్షపాతం చూపలేదని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates