‘మంత్రి పదవి ఇవ్వకుంటే ముఖ్యమంత్రినవుతా’

మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాకాలంగా సొంత పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తనకు మంత్రి పదవి ఇస్తానని వాగ్దానం చేశారని, కానీ, రెండేళ్లు గడుస్తున్నా ఆ మాట నిలబెట్టుకోలేదని రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.

మంత్రి పదవిపై తనకు హై కమాండ్ హామీ ఇచ్చిందని, ఇన్నాళ్లూ వేచి చూసినా ఫలితం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయినా సరే ఆయనపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు కాంగ్రెస్ హై కమాండ్ తీసుకున్నట్లు లేదు. ఈ క్రమంలోనే తాజాగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు.

మంత్రి పదవి ఇవ్వకుంటే డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతానంటూ ఆయన చేసిన కామెంట్స్ కాక రేపుతున్నాయి. ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రిని చేయండి..లేదంటే నేరుగా ముఖ్యమంత్రి పదవిని టార్గెట్ చేస్తా అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ఆశాభావం కూడా వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి.

వాస్తవానికి బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ హై కమాండ్ హామీనిచ్చింది. అయితే, ఆయన సోదరుడు వెంకట్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో ఒక ఇంట్లో రెండు మంత్రి పదవులు ఇస్తే మిగతా నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతుందని కాంగ్రెస్ హై కమాండ్ సైలెంట్ అయింది.

ఇద్దరు అన్నదమ్ముల్లో ఎవరో ఒకరు గెలుస్తారు…గెలిచిన వారికి మంత్రి పదవి ఇద్దాం అన్న భావనలో కాంగ్రెస్ హై కమాండ్ ఆ హామీ ఇచ్చి ఉండొచ్చు. అయితే, కేబినెట్ విస్తరణలో సైతం రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ దక్కలేదు. దీంతో, తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డిపై రాజగోపాల్ రెడ్డి కారాలు, మిరియాలు నూరుతున్నారు.

మంత్రి పదవి అడుక్కోబోనని, సమయం వస్తే లాక్కుంటానని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. పైసలు, నిధులు అన్నీ మీకేనా అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో గతంలో విమర్శించినా రేవంత్ సైలెంట్ గానే ఉన్నారు. ఇక, తాను ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని, కబ్జాలు చేయడానికి రాలేదని కొందరు కాంగ్రెస్ నేతలనుద్దేశించి ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. మరి, మంత్రిని చేయకుండే ముఖ్యమంత్రి అవుతానంటూ తాజాగా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ హై కమాండ్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.