బీజేపీకి మరింత దగ్గరవుతున్న సాయిరెడ్డి!

వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని కొద్ది నెలల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత యూ టర్న్ తీసుకున్న సాయిరెడ్డి…వైసీపీపై, జగన్ పై సునిశిత విమర్శలు చేయడం మొదలుబెట్టారు. లిక్కర్ స్కాం వ్యవహారంపై సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

ఈ క్రమంలోనే సాయిరెడ్డి బీజేపీలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ దిశగానే సాయిరెడ్డి సందర్భానుసారంగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం, బీజేపీ పాలసీలకు మద్దతుగా ట్వీట్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ క్రమంలోనే బీజేపీకి సాయిరెడ్డి మరింత దగ్గరవుతున్నారన్న సంకేతాలిచ్చేలా ఆయన తాజాగా ఎక్స్ లో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. దేశభక్తిని చాటుతూ బీజేపీకి అనుకూలంగా ఆయన చేసిన కామెంట్లు చరర్చనీయాంశమయ్యాయి.

ఇకపై “వందేమాతరం” పూర్తిగా పాడాల్సిందేనన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మనమంతా సమర్థించాలని, స్వాగతించాలని సాయిరెడ్డి అన్నారు. విదేశీ పాలకులు వెళ్ళిపోయినా విదేశీ మతాలు మాత్రం మన మధ్యే మిగిలిపోయాయని చెప్పారు.

అవి మన సంస్కృతి మీద ఇంకా పరిపాలన చెయ్యాలనే చూస్తున్నాయని, భారత దేశంలో పుట్టిన మనకు మనసే ఉండదా? అంటూ గుండెల నిండా దేశభక్తి నింపుకొని సాయిరెడ్డి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటికీ బానిసత్వపు సంకెళ్ళేనా? అని సాయిరెడ్డి ప్రశ్నించారు. విదేశీ మతాలవారు ఏదో అనుకుంటారని 120 ఏళ్లుగా మనమంతా సగం “వందేమాతరం” గేయాన్ని పాడామా?,  మన జాతీయ గేయంలో మన “అమ్మవార్ల” పేర్లే ఉండకూడదా? అని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే జాతీయ భావం, దేశభక్తి, విదేశీ మతాలు అంటూ సాయిరెడ్డి చేసిన కామెంట్లు ఆయనను బీజేపీకి మరింత దగ్గర చేసేలా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రేపోమాపో ఆయన కాషాయం కట్టేయ్ బ్రదర్ అంటూ కమల దళంలో చేరతారని సెటైర్లు వేస్తున్నారు.