పుష్ప స్టైల్లో ‘తగ్గేదే లే’ అంటున్న అంబటి

మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మరోసారి వార్తల్లో నిలిచారు. గుంటూరు కోర్టుకు తరలిస్తుండగా పోలీసు వ్యాన్‌లో నుంచే ‘పుష్ప’ సినిమా స్టైల్లో “తగ్గేదే లే” అంటూ చేసిన సైగలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా టిక్కెట్ల అవినీతి కేసు విచారణలో భాగంగా అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి పీటీ వారెంట్‌పై గుంటూరు కోర్టుకు పోలీసులు తీసుకువచ్చారు. కోర్టు ప్రాంగణానికి చేరుకున్న సమయంలో వ్యాన్ దిగే ముందు కిటికీలోంచి గెడ్డం కింద చేయి పెట్టి అల్లు అర్జున్ తరహాలో ‘తగ్గేదే లే’ మేనరిజం ప్రదర్శించడం అక్కడున్నవారిని ఆకర్షించింది.

ఆయన చూపిన ఈ మాస్ యాటిట్యూడ్‌పై పార్టీ కార్యకర్తలు ఉత్సాహం వ్యక్తం చేస్తుండగా, నెటిజన్లు మాత్రం విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ధైర్యానికి సంకేతమంటుంటే, మరికొందరు దీనిని అనుచితంగా విమర్శిస్తున్నారు.

ఇటీవల సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటికి బెయిల్ లభించింది. అలాగే గతేడాది మెడికల్ కాలేజీ అంశంపై జరిగిన ఆందోళనల్లో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న కేసులోనూ బెయిల్ వచ్చింది. ఈ రెండు కేసుల్లో బెయిల్ రావడంతో ఆయన విడుదల కావడం లాంఛనమేనని భావించిన వేళ, సంక్రాంతి లక్కీ డ్రా కేసులో పోలీసులు పీటీ వారెంట్‌పై కోర్టును ఆశ్రయించగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.

దీంతో అంబటికి మరోసారి నిరాశే ఎదురైంది. తాజా రిమాండ్ నేపథ్యంలో ఆయన తదుపరి న్యాయపరమైన చర్యలపై ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది.