చెన్నైలోని చెపాక్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ అంటే విజిల్స్ మోత మోగాల్సిందే. ఆ నగరానికి చెందిన ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్‌కింగ్స్ నినాదమే.. విజిల్ పోడు. అందుకు తగ్గట్లే ఐపీఎల్ సమయంలో విజిల్స్ మోత మోగిపోతుంటుంది. ఐపీఎల్ లేని సమయంలో కూడా విజిల్స్ సందడి చేస్తుంటాయి.
అంతర్జాతీయ మ్యాచ్‌లు, దేశవాళీ మ్యాచ్‌లు జరిగినపుడు కూడా స్టేడియం ముందు విజిల్స్ అమ్ముతుంటారు. అభిమానులు అవి కొనుక్కుని వచ్చి స్టాండ్స్‌లో కూర్చుని విజిల్స్‌తో హోరెత్తించడం ఎప్పుడూ కనిపించే దృశ్యాలే.
కానీ ఆదివారం ఇక్కడ ఇంగ్లాండ్, నేపాల్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ జరగ్గా.. స్టేడియం లోపలికి విజిల్స్ అనుమతించకపోవడం చర్చనీయాంశం అయింది.
స్టేడియంలోకి విజిల్స్ తీసుకురాకూడదని ఐసీసీ షరతులేమీ పెట్టలేదు. స్టేడియం నిర్వాహకులే ఈమేకు కండిషన్ పెట్టారు. ఇది తమిళనాట అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ పనే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తమిళనాట స్టార్ హీరో విజయ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి ఇటీవలే ఎన్నికల సంఘం విజిల్‌ను ఎన్నికల గుర్తుగా ఇచ్చింది. ఇక అప్పట్నుంచి ఆ పార్టీ మీటింగ్స్‌లో విజిల్స్ మోత మోగిపోతోంది. తమిళనాట అంతటా విజిల్స్ సందడి చేస్తున్నాయి.
విజయ్ పార్టీ గుర్తు చాలా వేగంగా జనాల్లోకి వెళ్లిపోయింది. ఇది అధికార డీఎంకే పార్టీకి ఆందోళన కలిగించే విషయమే. రాష్ట్రంలో విజయ్ పార్టీ ప్రభావం అంతకంతకూ పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే టీ20 ప్రపంచకప్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు విజిల్స్‌తో వచ్చి సందడి చేస్తే.. అది టీవీలో ప్రసారం అయితే విజయ్ పార్టీ సింబల్‌కు మరింత ప్రాచుర్యం లభిస్తుందన్న భయంతో చెపాక్ స్టేడియం నిర్వాహకులకు చెప్పి, విజిల్స్‌కు స్టేడియంలో అనుమతి లేదంటూ షరతు పెట్టించారని తమిళ మీడియా అంటోంది.
విజయ్ పార్టీ అంటే స్టాలిన్ సర్కారు ఎంత భయపడుతోందో చెప్పడానికి ఇది ఉదాహరణ అంటూ.. సామాజిక మాధ్యమాల్లో ఈ స్టార్ హీరోకు ఎలివేషన్ ఇస్తున్నారు ఫ్యాన్స్.
Gulte Telugu Telugu Political and Movie News Updates
