బీఆర్ ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీకి ఓటు వేయాలో వద్దో బీసీలు అందరూ ఆలోచించుకోవాలని ఆమె సూచించారు. ప్రస్తుతం బీఆర్ ఎస్ పార్టీ సుప్తచేతనావస్థలో ఉందని ఆమె వ్యాఖ్యానించారు. బీసీల విషయంపై తాను కొన్ని సూచనలు చేయాలని భావిస్తున్నట్టు కవిత పేర్కొన్నారు.
బీఆర్ ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఏమి చేసిందని ఆమె ప్రశ్నించారు. వారిని కనీసం తమ గడప వద్దకు కూడా బీఆర్ ఎస్ అగ్ర నేతలు రానివ్వలేదన్నారు. అంతేకాదు, బీసీలు ఐక్యంగా పోరాటం చేసుకునేందుకు కూడా అవకాశం లేకుండా చేశారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీసీ బిడ్డలు ప్రాణాలకు తెగించి పోరాడారని, కానీ వారిని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. బీసీలను గాలికి వదిలేసిన పార్టీ ఏదైనా ఉంటే అది బీఆర్ ఎస్ మాత్రమేనని కొందరు బీసీ వర్గానికి చెందిన నాయకులు తనకు చెప్పారని తెలిపారు.
బీసీ రిజర్వేషన్ అంశాన్ని కూడా బీఆర్ ఎస్ నాయకులు దాటవేస్తున్నారని, ఈ విషయంలో వారి స్టాండ్ ఏమిటో బీసీ సామాజిక వర్గానికి చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. అంతేకాదు, బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్ వేసిన మాధవరెడ్డికి ఆ పార్టీ టికెట్ ఎలా కేటాయించిందని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో బీసీలు ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయాలన్నది కూలంకషంగా చర్చించుకుని నిర్ణయం తీసుకోవాలని కవిత సూచించారు.
ఈ నెల 11న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక త్వరలోనే తన పార్టీకి ముహూర్తం పెట్టాలని నిర్ణయించుకున్నట్టు ఆమె తెలిపారు. తమ రాజకీయ పార్టీ ఆవిర్భావానికి మంచి ముహూర్తం కోసం చూస్తున్నామని చెప్పారు. కాగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్రను ఎవరూ చెరిపివేయలేరని వ్యాఖ్యానిస్తూ, పరోక్షంగా ఆయన్ని జాతిపితగా పేర్కొంటున్న బీఆర్ ఎస్ నాయకులకు మద్దతుగా మాట్లాడడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
