గతంలో చాలామంది రాజకీయ నాయకులు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ఎన్నికల ప్రచారం సమయంలో చిన్న పిల్లలకు స్నానం చేయించడం వంటి పనులు మొదలు…మురికి కాలువలు శుభ్రం చేయడం వరకు…నానా తిప్పలు పడి తమను తాము మీడియాలో ప్రమోట్ చేసుకునేవారు.
అయితే, ఈ సోషల్ మీడియా జమానాలో ట్రెండ్ మారడంతో నేతలంతా సోషల్ మీడియా హ్యాండిల్స్ వాడడంతో పాటు సరికొత్త ట్రెండ్ లో ప్రజలకు చేరువవుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేత, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్విగ్గీ డెలివరీ బాయ్ అవతారమెత్తిన వైనం హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గిగ్ వర్కర్స్ 10 నిమిషాల డెలివరీ వ్యవహారంపై ఈ మధ్య పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఆ టెన్ మినిట్స్ టెన్షన్ వద్దంటూ ఏకంగా సుప్రీం కోర్టు చెప్పడంతో బ్లింకిట్, జొమాటో, స్విగ్గీ వెనక్కు తగ్గాయి.
ఈ క్రమంలోనే డెలివరీ బాయ్స్ కష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగాను అంటున్నారు బోడె ప్రసాద్. తన నియోజకవర్గ ప్రజల ఇళ్లకు స్విగ్గీ డెలివరీ బాయ్ గెటప్ లో నేరుగా వెళ్లడంతో జనం షాకయ్యారు.
సార్ మీరా….స్విగ్గీ డెలివరీ బాయ్ అనుకున్నాం…మీరేంటి సార్ ఫుడ్ డెలివరీ చేస్తున్నారంటూ మహిళలు అవాక్కయ్యారు. ఇక, ప్రొఫెషనల్ గా బోడె ప్రసాద్ ఓటీపీ అడిగి మరీ ఫుడ్ డెలివరీ చేసి అసలు విషయం చెప్పారు.
డెలివరీ బాయ్స్ కష్టాలు ఏంటి, సమస్యలు ఏంటి అని స్వయంగా తెలుసుకోవాలని నేరుగా తానే డెలివరీ బాయ్ గా మారానని బోడె ప్రసాద్ చెప్పారు. ఈ క్రమంలోనే బోడె ప్రసాద్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates