ఏపీ విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సరికొత్త అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా లోకేశ్ వేస్తున్న అడుగులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. సాదాసీదాగా ఆలోచన చేసే వ్యక్తులకు అసలు ఈ ఐడియాలే తట్టే అవకాశం లేదు. ఓ అంశంపై ఎంతో లోతుగా పరిశోధన జరిపితేనే గానీ ఈ తరహా ఆలోచనలు రావనే చెప్పాలి. ఏపీ విద్యా వ్యవస్థను సమున్నత శిఖరాలకు చేర్చే దిశగా లోకేశ్ ఇప్పుడు ఇదే పని చేస్తున్నారు. ఏదో అల్లాటప్పాగా కాకుండా తనకు దక్కిన అవకాశంతో విద్యా వ్యవస్థను అందనంత ఎత్తులో నిలిపేందుకు ఆయన అవిరళ కృషి చేస్తున్నారు. అందుకు నిదర్శనంగా అమరావతి వేదికగా మంగళవారం ఓ కీలక ఒప్పందం జరిగింది.
రేమాండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్న సింఘానియా స్కూల్ ట్రస్ట్ తో ఏపీ ప్రభుత్వం మంగళవారం ఓ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం… తిరుపతి జిల్లాలోని 14 ప్రభుత్వ పాఠశాలల్లో సింఘానియా స్కూల్ ట్రస్ట్ తాను రూపొందించిన పాఠ్య ప్రణాళికలను అమలు చేయనుంది. ఈ పాఠ్య ప్రణాళికలో ఉపాధ్యాయుల పనితీరు, విద్యా నాణ్యత, ఉపాధ్యాయ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ లో తర్ఫీదు, సాంకేతిక అనుసంధానం వంటి కార్యక్రమాలను ట్రస్ట్ చేపడుతుంది. ఈ మొత్తం వ్యవహారాలను సింఘానియా స్కూల్ ట్రస్ట్ తన సొంత నిధులతోనే చేపట్టనుంది. పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్న ఈ ఒప్పందంలో వచ్చే ఫలితాలను ఆధారం చేసుకుని… తదనంతర కాలంలో ఈ కార్యక్రమాన్ని అమరావతి, విశాఖపట్నం, కాకినాడలకూ విస్తరించే అవకాశాలను పరిశీలిస్తారు.
ఈ మేరకు ఏపీ ప్రభుత్వం, సింఘానియా స్కూల్ ట్రస్ట్ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రేమాండ్స్ దుస్తులు ఏ క్వాలిటీతో, ఎంత రిచ్ లుక్కులో కనిపిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ కంపెనీ యాజమాన్యమే సింఘానియా ఫ్యామిలీ. విజయ్ పత్ సింఘానియా రేమాండ్స్ ను నెలకొల్పగా.. ప్రస్తుతం ఆయన కుమారుడు గౌతమ్ సింఘానియా దాని వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. దేశ పారిశ్రామిక రంగ దిగ్గజాల్లో ఒకటిగా ఎదిగిన సింఘానియాలు ప్రస్తుతం వ్యాపారంతో పాటుగా సేవా రంగంలోకి కూడా అడుగు పెట్టారు. ఇప్పటికే సింఘానియా స్కూల్ ట్రస్ట్ ను స్థాపించిన సింఘానియాలుదేశంలోని పలు ప్రాంతాలకు తమ అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో కూడిన సేవలను అందిస్తున్నారు. ఆ సేవలను ఇప్పుడు లోకేశ్ పుణ్యమా అని ఏపీకి.. అందులోనూ ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో చదవుతున్న పేద పిల్లలకు అందేందుకు రంగం సిద్ధం కావడం గమనార్హం.