టిల్లు చెప్పి మరీ కొడుతున్నాడు  

లేటెస్ట్ బ్లాక్ బస్టర్ టిల్లు స్క్వేర్ రిలీజైన మొదటి రోజు మధ్యాన్నమే నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఫైనల్ రన్ కి ఈజీగా వంద కోట్ల క్లబ్బులో అడుగు పెడుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే నిజమవుతోంది. యూనిట్ అఫీషియల్ గా ప్రకటించిన ప్రకారం ఇంకా మొదటి వారం పూర్తవ్వకుండానే 91 కోట్ల గ్రాస్ తో సెంచరీ దిశగా పరుగులు పెడుతోంది. నిజానికి దీని మీదున్న అంచనాలకు ఇది పెద్ద మొత్తమే. ట్రైలర్ వచ్చినప్పటి నుంచి మిశ్రమ స్పందన మోసుకుంటూ వచ్చిన ఈ ఎంటర్ టైనర్ ఫైనల్ గా బ్లాక్ బస్టర్ ముద్ర వేయించుకుంది.

రేపు ఫ్యామిలీ స్టార్ రిలీజవుతున్నా దాని ప్రభావం టిల్లు స్క్వేర్ మీద తీవ్రంగా లేకపోవడం ఆశ్చర్యపరిచే విషయం. బుక్ మై షోలో సగటు గంటల చొప్పున లెక్కేసే అడ్వాన్స్ బుకింగ్స్ రెండింటికి దాదాపు సమానంగా ఉండటం షాకే. ఎందుకంటే విజయ్ దేవరకొండ లాంటి ఇమేజ్ ఉన్న హీరో కొత్త సినిమాతో సమానంగా ఎనిమిదో రోజు వసూళ్లను హోల్డ్ చేయడం చిన్న విషయం కాదు. వీక్ డేస్ లోనూ ఈ దూకుడు ఎవరూ ఊహించనిది. ఫ్యామిలీ స్టార్ వల్ల థియేటర్ కౌంట్ లో తగ్గుదల ఉండొచ్చేమో కానీ కలెక్షన్లు మాత్రం స్టడీగా ఉన్నాయని డిస్ట్రిబ్యూటర్ల నుంచి అందుతున్న వార్త.

ఇంకో రెండు వారాలకు పైగా టిల్లు ప్రభంజనం కొనసాగేలా ఉంది. వచ్చే వారం నుంచి మరీ చెప్పుకోదగ్గ భారీ చిత్రాలు లేకపోవడం సిద్దు జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ ఇద్దరికీ ప్లస్ కానుంది. రంజాన్ సందర్భంగా బాలీవుడ్ లో బడా సినిమాలున్నాయి కానీ తెలుగులో ఉగాది తర్వాత చెప్పుకోదగ్గవి లేవు. సో ఫ్యామిలీ స్టార్ కూడా హిట్ టాక్ తెచ్చుకుంటే ఏప్రిల్ చివరి వరకు థియేటర్ల ఫీడింగ్ కి ఇవి సరిపోతాయి. యూత్ ఒకదానికి, ఫ్యామిలీస్ మరొకదానికి వెళ్లిపోతాయి. వేసవిలో హిట్ల ఖాతాలో టిల్లు  స్క్వేర్ మంచి బోణీ చేసింది. చేతిలో కథ రెడీ కాకపోయినా అప్పుడే టిల్లు క్యూబ్ మీద హైప్ మొదలైంది.