కొన్ని వారాల క్రితం రిలీజై కన్నడలో సంచలన విజయం సాధించిన హాస్టల్ హుడుగురు బేకాగిద్దరేని తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో డబ్ చేసి తీసుకొస్తున్నాయి అన్నపూర్ణ స్టూడియోస్, ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్. ఒరిజినల్ వెర్షన్ హైదరాబాద్ లో విడుదలైనప్పుడు సబ్ టైటిల్స్ తో చూసిన వాళ్లకు ఇందులో ఉన్న యూత్ ఫుల్ కంటెంట్ షాక్ ఇచ్చింది. అందుకే వీలైనంత త్వరగా తెలుగు ఆడియన్స్ కి అందివ్వాలన్న ఉద్దేశంతో ఆగస్ట్ 25న విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ గట్టి నమ్మకంతో థియేటర్లకు తీసుకొస్తున్నారు. ఇవాళ లాంచ్ చేసిన ట్రైలర్ లో కథేంటో సూటిగా చెప్పేశారు.
అదో పెద్ద బాయ్స్ హాస్టల్. వందలాది కుర్రాళ్ళ అల్లరితో నిత్యం మోత మ్రోగిపోతూ ఉంటుంది. సినిమాలు, అమ్మాయిలు, గొడవలు ఇవే ప్రపంచంగా బ్రతుకుతూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటారు. వార్డెన్ ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా సరే అతని పప్పులేవీ వీళ్ళ ముందు ఉడకవు. అనుకోకుండా ఒక రోజు అతను శవమైపోతాడు. అది కాస్తా నలుగురు అబ్బాయిల మీద పడుతుంది. అసలు సీరియస్ నెస్ అంటేనే తెలియని వీళ్లకు ఇప్పుడీ నేరాన్ని ఎలా దాచి పెట్టాలో అర్థం కాదు. అక్కడి నుంచి మొదలవుతుంది రియల్ హంగామా. ఇంతకీ డ్రామా ఎలా జరిగింది, ఏ మలుపు తిరిగిందనేదే స్టోరీ
మూడున్నర నిముషాలపాటు వీడియోని కట్ చేసిన టీమ్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఇక్కడా ఫలితం రిపీట్ అవుతుందన్న నమ్మకం కనిపిస్తోంది. మొత్తం కన్నడ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ యాంకర్ రష్మీ, తరుణ్ భాస్కర్ లతో రీ షూట్ చేసిన కొన్ని సన్నివేశాలు నేటివిటీని పెంచాయి. విరూపాక్ష, మంగళవారం ఫేమ్ అజనీష్ లోకానాధ్ సంగీతం, అరవింద్ ఎస్ కశ్యప్ ఛాయాగ్రహణం క్రేజీగా ఉన్నాయి. కింగ్ అఫ్ కొత్త, గాండీవధారి అర్జున, బెదురులంక 2012తో పోటీ పడబోతున్న బాయ్స్ హాస్టల్ లో మ్యాటరైతే గట్టిగానే ఉంది. యువతకు కనెక్ట్ అయితే వసూళ్ల వర్షం ఖాయమే.