ఇండియన్-2కు అదిరిపోయే ఆఫర్

ప్రస్తుతం ఇండియాలో మంచి క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో ‘ఇండియన్-2’ ఒకటి. రెండున్నర దశాబ్దాల కిందట సంచలనం రేపిన ‘ఇండియన్/భారతీయుడు’ సినిమాకు కొనసాగింపుగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ‘ఇండియన్’లో హీరోగా నటించిన కమల్ హాసనే ఇప్పుడు కూడా లీడ్ రోల్ చేస్తున్నాడు.

నాలుగేళ్ల కిందటే మొదలైన ఈ సినిమా సెట్లో జరిగిన ఘోర ప్రమాదం, కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. రెండేళ్లకు పైగా షూటింగ్ ఆపేశారు. ఐతే దర్శక నిర్మాతలు, హీరో మాట్లాడుకుని గత ఏడాది చివర్లో మళ్లీ చిత్రీకరణను పున:ప్రారంభించారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ అనుకుంటున్నారు. ప్రస్తుతం శంకర్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు సినిమా బిజినెస్ చర్చలు మొదలయ్యాయి.

రిలీజ్‌కు చాలా టైం ఉండగానే ఈ సినిమాకు క్రేజీ ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మీద ఉన్న అంచనాలను మించి దీనికి డిజిటల్ డీల్ ఆఫర్ ఒకటి వచ్చినట్లు సమాచారం. స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.220 కోట్లకు ఈ సినిమా డిజిటల్ హక్కులు కొనబోతున్నట్లు తెలిసింది. అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులకూ కలిపి ఈ రేట్ కోట్ చేశారట. 

ఇప్పుడు ఇది కొంచెం ఎక్కువ రేటు అనిపించినా.. రిలీజ్ టైంకి దీన్ని ఈజీగా వర్కవుట్ చేయొచ్చని నెట్ ఫ్లిక్స్ భావిస్తోందట. ‘ఇండియన్-2’ డిజిటల్ హక్కుల కోసం అమేజాన్ ప్రైమ్, జీ ఓటీటీలు కూడా గట్టిగా పోటీ పడుతున్నట్లు సమాచారం. ఐతే నెట్ ఫ్లిక్స్‌కే హక్కులు సొంతమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని రూ.200 కోట్లలో తీయాలనుకున్నారు కానీ.. సినిమా పూర్తయ్యేసరికి బడ్జెట్ రూ.300 కోట్లను దాటబోతున్నట్లు సమాచారం. వచ్చే వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.