వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో ఇండియాలోనే కాస్ట్లీ ఫిలింగా రూపొందిస్తున్న ప్రాజెక్ట్ కెలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ని అఫీషియల్ గా విడుదల చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు రిలీజ్ చేస్తామని చెప్పినప్పటికీ రెండు గంటలు ఆలస్యంగా రివీల్ చేశారు. అయితే సింపుల్ గా ప్రభాస్ ఫేస్ ని రివీల్ చేయకుండా సినిమాలో గెటప్ ని కంప్లీట్ గా చూపించడం విశేషం. ఒళ్ళంతా మెటల్ డ్రెస్ తో అవెంజర్స్ సూపర్ హీరోలా డార్లింగ్ కి ఇచ్చిన బిల్డప్ ఓ రేంజ్ లో ఉంది. హెయిర్ స్టైల్ కూడా వెరైటీగా పొడవాటి జుత్తుతో కొత్త స్టైలింగ్ ఇచ్చారు.
చూసేందుకు బాగానే ఉంది కానీ కొంత సహజత్వం లోపించినట్టు అనిపిస్తోంది. అది విజువల్ ఎఫెక్ట్ వల్ల జరిగిందా లేక రేపు టీజర్ రిలీజ్ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఇలా చేయాల్సి వచ్చిందా అనేది వేచి చూడాలి. ఈ ఒక్క మైనస్ ని పక్కన పెడితే ప్రాజెక్ట్ కెలో తన క్యారెక్టర్ ఎలా ఉండబోతోందనే క్లారిటీ అయితే వచ్చేసింది. ప్రపంచాన్ని నాశనం చేయాలనుకున్న దుష్ఠశక్తులను అంతమొందించే లక్ష్యంతో పోరాడే వీరుడిగా ప్రభాస్ ని సరికొత్తగా చూడొచ్చు. ప్రీ లుక్ పోస్టర్స్ లో గతంలో చూపించిన ఆ రెండో చేయి ఎవరిదో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది.
వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కె అనే ప్రమోషన్ మాత్రం ఇంకా కొనసాగుతోంది. కె అంటే కల్కి, కాలచక్రం, కురుక్షేత్రం అంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వాటికి చెక్ మరికొద్దిగంటల్లో పడబోతోంది, శాన్ డైగో వేదిక మీద ప్రభాస్, రానా, దీపికా పదుకునే, కమల్ హాసన్ లతో పాటు దర్శక నిర్మాతలు టైటిల్, కాన్సెప్ట్ ని ప్రపంచానికే పరిచయం చేయబోతున్నారు. అయిదు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ప్రాజెక్ట్ కె ఇకపై ప్రమోషన్లకు సంబంధించి ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి. నాగ అశ్విన్ అద్భుతం చేయబోతున్నాడని మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు.