ఆదిపురుష్.. కోరుకున్నది వచ్చినట్లేనా?

ఒక ఏడు నెలలు వెనక్కి వెళ్తే ‘ఆదిపురుష్’ సినిమా మీద ఎంత నెగెటివిటీ నెలకొందో గుర్తుండే ఉంటుంది. బహుశా ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఒక టీజర్ మీద అంత ట్రోలింగ్ ఎన్నడూ జరిగి ఉండదేమో. ఆ టీజర్లో విజువల్ ఎఫెక్ట్స్.. రావణుడు, హనుమంతుడి పాత్రల మేకప్ విషయమై విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజన్లు. ఏకంగా ఐదొందల కోట్లు ఖర్చు పెట్టిన సినిమా మీద విపరీతమైన నెగెటివిటీ ముసురుకోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడింది చిత్ర బృందం.

అభిమానులు, మీడియాకు ప్రత్యేకంగా త్రీడీ టీజర్‌ ప్రదర్శించినా.. పరిస్థితి మారలేదు. అప్పుడున్న నెగెటివిటీలో సంక్రాంతికే సినిమాను రిలీజ్ చేసి ఉంటే కొంప మునిగేదేమో. తీవ్రతను గ్రహించి.. వీఎఫెక్స్ సహా అన్ని విషయాల్లో మళ్లీ వర్క్ చేయాలని నిర్ణయించుకున్నారు. సినిమాను ఐదు నెలలకు పైగా వాయిదా వేశారు. ఐతే కొత్త డేట్ దగ్గరపడుతుండగా.. రిలీజ్ చేసిన కొన్ని ప్రోమోలు కూడా ఆకట్టుకోకపోవడంతో నెగెటివిటీ కొనసాగింది.

‘ఆదిపురుష్’ ఎప్పుడు వచ్చినా డిజాస్టరే అవుతుందన్న అభిప్రాయం జనాల్లో బలపడిపోయింది. కానీ ఆశల్లేని స్థితిలో ‘జై శ్రీరామ్’ పాట ఈ సినిమా పట్ల జనాల దృష్టిని కొంచెం మార్చింది. ఆ పాటతో మొదలైన పాజిటివిటీ.. ట్రైలర్ లాంచ్ తర్వాత మరింత పెరిగింది. అప్పటికి నెగెటివిటీ అంతా దాదాపుగా తగ్గిపోయింది. ఒక్కసారి పాజిటివిటీ మొదలయ్యాక చిత్ర బృందంలో ఉత్సాహం రెట్టింపైంది. పబ్లిసిటీ ఊపు మరింత పెరిగింది.

తాజాగా తిరుపతి వేదికగా నిర్వహించిన ప్రి రిలీజ్ ఈవెంట్ సూపర్ హిట్ అయిందనే చెప్పాలి. ఈ వేడుకకు వేదికను అలంకరించిన తీరు.. అభిమానుల కోసం చేసిన ఏర్పాట్లు.. ఈవెంట్‌ను నిర్వహించిన వైనం.. ప్రభాస్ సహా అందరి ప్రసంగాలు.. దీనికి మీడియాలో దక్కిన కవరేజీ.. అన్నీ కూడా సినిమా పట్ల సానుకూలతను పెంచాయి. కొత్తగా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. మొత్తంగా సినిమాకు ఇప్పుడు మాంచి హైప్ కనిపిస్తోంది. ఈ సినిమా మొదలైనపుడు ఏం కోరుకున్నారో అది ఇప్పుడు జరుగుతున్నట్లే కనిపిస్తోంది. సినిమాకు ఓపెనింగ్స్ ఒక రేంజిలో ఉంటాయని అంచనా వేస్తున్నారు.