ఉప్పెనతో అమాంతం కుర్రకారు ఫాలోయింగ్ పెరిగిపోయిన హీరోయిన్ కృతి శెట్టికి కేవలం నెల తిరక్కుండానే రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు గట్టి షాక్ ఇచ్చాయి. రామ్, నితిన్ కెరీర్లలోనే అత్యధిక బడ్జెట్ లతో రూపొందిన ది వారియర్, మాచర్ల నియోజవర్గం రెండూ మరీ దారుణంగా బోల్తా కొట్టడం ఒక ఎత్తయితే అందులో తనవి పెద్దగా ప్రాధాన్యత లేని కేవలం పాటల కోసమే ఉన్నట్టుగా అనిపించే పాత్రలు కావడం మరో మైనస్ అయ్యింది. శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు హిట్ల తాలూకు ఆనందం ఇంత త్వరగా ఆవిరవ్వడం ఊహించనిది
ఇప్పుడు తన ఆశలన్నీ “ఆ అమ్మాయికి గురించి మీకు చెప్పాలి” మీదే ఉన్నాయి. ఏఎంబి మాల్ లో లిరికల్ సాంగ్ విడుదల సందర్భంగా తన ఫ్లాపుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు లింగుస్వామి, శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళతో పని చేయడం వల్ల ఎంతో నేర్చుకున్నానని హిట్టు ఫ్లాపు అనే తేడా సినిమా చేయడానికి ముందు తెలియదు కాబట్టి కష్టంలో ఎలాంటి మార్పు ఉండదని తెలివైన సమాధానం చెప్పింది. సెప్టెంబర్ 16 విడుదల కాబోతున్న ఈ లవ్ ఎంటర్ టైనర్ లో సమ్మోహనం లాగే సినిమా బ్యాక్ డ్రాప్ నే తీసుకున్నారు
శ్రీదేవి సోడా సెంటర్ తర్వాత సుధీర బాబుకి కూడా ఇది సక్సెస్ కావడం చాలా కీలకం. వ్యక్తిగతంగా తన మార్కెట్ ఇంకా బలపడని తరుణంలో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణే తనకు మరో బ్రేక్ ఇస్తాడనే నమ్మకంతో ఉన్నాడు. పైగా ఏదో ప్రయోగం చేద్దామని రివెంజ్ డ్రామా తీసుకుని వితో షాక్ తిన్న ఇంద్రగంటి తిరిగి తన ఓల్డ్ స్కూల్ కు వచ్చేసి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి తీశారు. కారణాలేమిటో కానీ ఇది కూడా చాలా ఆలస్యంగానే వస్తోంది. ఆ మధ్య కొన్ని నెలలు కనీసం అప్డేట్స్ ఇవ్వకుండా ఆపేశారు. మరి కృతి శెట్టి హ్యాట్రిక్ డేంజర్ నుంచి ఈ అమ్మాయి ఎలా తప్పిస్తుందో వచ్చే నెల చూడాలి.