వారియర్‌‌గా వస్తున్న రామ్

పక్కా కమర్షియల్‌ సినిమాలతో మెప్పించే యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్.. ‘ఇస్మార్ట్‌ శంకర్’ చిత్రంతో ఊరమాస్‌ని రుచి చూపించాడు. ఆ తర్వాత ‘రెడ్’ సినిమాలో క్లాస్‌ క్యారెక్టర్‌‌నీ మాస్‌ రోల్‌నీ ఒకేసారి పండించాడు. రీసెంట్‌గా మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన తమిళ డైరెక్టర్‌‌ లింగుస్వామితో ఒక సినిమాకి కమిటయ్యాడు.

ఇంకేముంది.. ఇద్దరి కాంబినేషన్‌లో అదిరిపోయే మాస్ మూవీ రావడం ఖాయమని ఫిక్సయ్యారంతా. ర్యాపో 19 అనే వర్కింగ్ టైటిల్‌తో స్టార్ట్ చేసిన ఈ మూవీ అసలు టైటిల్‌ను ఇవాళ రివీల్ చేశారు. రామ్ పోలీసాఫీసర్‌‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘ద వారియర్’ అనే పేరును ఖరాను చేశారు. ఫస్ట్ లుక్‌ను కూడా వదిలారు.

కానిస్టేబుళ్ల మధ్య ఆఫీసర్‌‌ హోదాలో హుందాగా నిలబడ్డాడు రామ్. ఖాకీ యూనిఫామ్‌లోని పవర్‌‌ అతని కళ్లల్లో కనిపిస్తోంది. ట్రిమ్ చేసిన హెయిర్.. కోర మీసం.. చేతిలో పిస్టల్‌తో అగ్రెసివ్‌గా కనిపిస్తున్నాడు. ఈ టైటిల్‌ అతని క్యారెక్టర్‌‌కి యాప్ట్ అయ్యుండొచ్చనే ఫీలింగ్‌ని తన లుక్‌తో కలిగిస్తున్నాడు.       

ఇదొక ఔట్ అండ్ ఔట్ యాక్షన్ థ్రిల్లర్‌‌ అని, లింగుస్వామి గత చిత్రాలను మించి మాస్‌గా ఉంటుందని చెప్పి ఊరిస్తోంది టీమ్. కృతీశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో మూవీ రూపొందుతోంది. ఆది పినిశెట్టి విలన్‌గా నటించడం మరింత మంచి అంచనాలను ఏర్పరుస్తోంది. టైటిల్, రామ్ లుక్ చూశాక ఆ అంచనాలు మరింత పెరగడం ఖాయమనిపిస్తోంది.