సార్వత్రిక ఎన్నికలో.. ఉప ఎన్నికలో అయితే ఎంత రాజకీయం ఉంటుందో.. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కు జరిగే ఎన్నికలకు సంబంధించి కూడా అంతే రాజకీయం నడుస్తోంది. వెయ్యి మంది కూడా సభ్యులు లేని ఈ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ ఎన్నికలు జరగటానికి మరో మూడు నెలల సమయం ఉంది. ఎప్పుడైతే ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రకటించారో అప్పటి నుంచి వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
అసలు ప్రకాశ్ రాజ్ ఎందుకు పోటీ చేస్తున్నట్లు? ఆయన పోటీ చేయాలని ఎప్పుడు డిసైడ్ అయ్యారు? ఆయన వెనుక ఉన్నదెవరు? పర భాషా నటుడు ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారన్న ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి. మరి.. ఇలాంటి ప్రశ్నలకు ప్రకాశ్ రాజ్ ను అడిగితే ఆయనేం సమాధానం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ప్రకాశ్ రాజ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనేం చెప్పారంటే..
- ఒక రోజులో హటాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. దాని వెనుక చాలా మథనం ఉంది. ఈ పరిశ్రమ నాకు పేరు.. హోదా.. గౌరవం ఇచ్చింది. అలాంటప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయాల్ని చూస్తూ ఊరుకోవటం మంచిది కాదనిపించింది. ఊరికే బాగోలేదన్న ఫిర్యాదులు చేసే బదులు.. పని చేసి చూపించటం కష్టం. అది బాధ్యత కూడా. అందుకే నిర్ణయం తీసుకున్నా.
- ఏడాది క్రితం నుంచి కళ్ల ముందు జరుగుతున్నది చూస్తూ కూర్చోవటం సరికాదనిపించింది. సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలనిపించింది. నాలా ఆలోచించే వారితో ఒక టీం తయారు చేసుకున్నా. మార్చిలో జరగాల్సిన ఎన్నికలు కొవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి. కానీ.. ఆ విషయాన్ని అయినా కమిటీ చెప్పాలి కదా? ఎప్పుడు ఎన్నికలు జరుపుతారని ఇప్పటికి చెప్పటం లేదు. నా ఉద్దేశంలో ఇప్పుడున్ని ఎన్నికైన బాడీ కాదు. దాని సమయం పూర్తైంది. అందుకే మేం ప్యానల్ ప్రకటించాం.
- సినిమా అనేది ఒక భాష. వీడు మనోడు.. వేరే వాడు అనే ఆలోచన తప్పు. తెలుగు వ్యక్తి విశాల్ తమిళనాడు అసోసియేషన్ ఎన్నికల్లో గెలవలేదా? అక్కడ అన్ని భాషల వారు పోటీ చేశారు కదా? ఇప్పుడు లోకల్.. నాన్ లోకల్ అని మాట్లాడుతున్న వారికి నేను తెలంగాణలోని కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అనిపించలేదా?
- నా అసిస్టెంట్లకు హైదరాబాద్ లో ఇళ్లు కొని ఇచ్చినప్పుడు నాన్ లోకల్ అనిపించలేదా? నాకు ఇక్కడ పొలం ఉంది. ఇల్లు ఉంది. నా కొడుకు ఇక్కడే స్కూలుకు వెళతాడు. నా ఆధార్ కార్డు అడ్రస్ ఇక్కడే ఉంది. అలాంటప్పుడు నేను నాన్ లోకల్ ఎందుకు అవుతారు? అంత:పురం సినిమాకు జాతీయ అవార్డు తీసుకున్నప్పుడు నేను నాన్ లోకల్ కాలేదే? తొమ్మిది నందులు తీసుకున్నప్పుడు నేను నాన్ లోకల్ కాలేదే? అప్పుడు లేనిది ఇప్పుడెందుకు వచ్చింది? ప్రకాశ్ రాజ్ తెలుగు వాడు కాదని ఎవరైనాఅంటే ప్రేక్షకులే వారి మోహం మీద నవ్వుతారు.