అప్పుడు బాల‌య్య‌తో… ఇప్పుడు చిరుతో?

మిగ‌తా అగ్ర క‌థానాయ‌కుల‌తో పోలిస్తే ప్ర‌భాస్ కొంచెం వేగంగానే సినిమాలు చేస్తుంటాడు కానీ.. బ‌య‌ట అభిమానుల‌కు క‌నిపించ‌డం త‌క్కువ‌. సినిమా ఈవెంట్ల‌కు పెద్ద‌గా రాడు. బ‌య‌ట పార్టీల్లో క‌నిపించ‌డు. సోష‌ల్ మీడియాలోనూ అంత యాక్టివ్‌గా ఉండ‌డు. త‌న స‌న్నిహితులకు సంబంధించిన సినిమాల‌కు మాత్రం ప్ర‌మోష‌న్ ప‌రంగా సాయం చేయాల్సి వ‌చ్చిన‌పుడు మీడియా దృష్టిలో ప‌డుతుంటాడంతే.

ఇలా ఎప్పుడో కానీ ద‌ర్శ‌న‌మివ్వ‌ని ప్ర‌భాస్ అంటే అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల్లోనూ ఒక క్యూరియాసిటీ ఉంటుంది. కొన్నేళ్ల ముందు నందమూరి బాల‌కృష్ణ హోస్ట్ చేసిన అన్‌స్టాప‌బుల్ షోలో ప్ర‌భాస్ పాల్గొన్న ఎపిసోడ్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. అది రెబ‌ల్ ఫ్యాన్స్‌కు ఒక మ‌ధుర జ్ఞాప‌కం.

చాన్నాళ్ల త‌ర్వాత ఇప్పుడు మ‌రోసారి ఒక టాక్ షోలో క‌నిపించే అవ‌కాశాలున్న‌ట్లు స‌మాచారం. మెగాస్టార్ చిరంజీవితో నెట్ ఫ్లిక్స్ సంస్థ మెగావ‌ర్స్ పేరుతో ఒక సెల‌బ్రెటీ టాక్ షోను ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన ఒకట్రెండు ఎపిసోడ్ల‌ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. తొలి ఎపిసోడ్‌లో పాల్గొన్న‌ది చిరుకు స‌న్నిహితుడైన‌ అక్కినేని నాగార్జున‌, మిగ‌తా అక్కినేని హీరోలని స‌మాచారం. మ‌రికొంద‌రు ప్ర‌ముఖుల‌తో ఎపిసోడ్లు ప్లాన్ చేస్తుండ‌గా.. ఆ జాబితాలో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కూడా ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ ఎపిసోడ్ కోసం ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌తో మెగావ‌ర్శ్ టీం సంప్ర‌దింపులు జ‌రుపుతోంద‌ట‌.

రెబల్ స్టార్ కొన్ని రోజులుగా ఫౌజి సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. మార్చిలో కొత్త రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో వీలైనంత త్వ‌ర‌గా ఆ సినిమాను పూర్తి చేయ‌డానికి ప్ర‌భాస్ ట్రై చేస్తున్నాడు. ఆ సినిమా షెడ్యూల్ అయ్యాక మెగావ‌ర్శ్ కోసం ప్ర‌భాస్ కాల్ షీట్ ఇస్తాడ‌ని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్లో చిరు వీరాభిమాని, ప్ర‌భాస్‌తో స్సిరిట్ సినిమా తీస్తున్న సందీప్ రెడ్డి వంగ కూడా పాల్గొంటాడ‌ని స‌మాచారం. కాబ‌ట్టి ఈ ఎపిసోడ్ సోష‌ల్ మీడియాను షేక్ చేయ‌డం ఖాయం.