హిట్టు సినిమాల నుంచి బ్యాగ్రౌండ్ స్కోర్ బిట్స్ సంగీత ప్రియులు యూట్యూబ్ వీడియోల నుంచి కట్ చేసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసుకుని ఎలివేషన్లు వేసుకోవడం ఎప్పట్నుంచో ఉన్నదే. ఐతే ఈ మధ్య సంగీత దర్శకులే ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌ను స్పెషల్‌గా రిలీజ్ చేయడం ట్రెండుగా మారింది. తమిళంలో అనిరుధ్ రవిచందర్, జి.వి.ప్రకాష్ కుమార్ ఈ ట్రెండుకు ఊపు తెచ్చారు.
తెలుగులో తమన్ కూడా అప్పుడప్పుడూ కొన్ని సినిమాలకు ఓఎస్‌టీ రిలీజ్ చేసి స్టార్ హీరోల ఫ్యాన్స్‌ను సంతోషంలో ముంచెత్తుతున్నాడు. ఐతే అన్ని సినిమాల ఓఎస్‌టీ కోసం అభిమానులు ఎదురు చూడరు. కొన్ని సినిమాలు బీజీఎం విషయంలో బాగా ఇంప్రెస్ చేసి.. ఓఎస్‌టీ కోసం ఎదురు చూసేలా చేస్తుంటాయి. అలాంటి చిత్రాల్లో ‘డాకు మహరాజ్’ ఒకటి.
గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘డాకు మహరాజ్’ నందమూరి బాలకృష్ణ సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనదగ్గ బీజీఎంతో బాలయ్య అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ సినిమా రిలీజైన 20 నెలల తర్వాత తమన్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌ను ఆన్ లైన్లో రిలీజ్ చేశాడు. దీని కోసం ఎప్పట్నుంచో బాలయ్య అభిమానుల నుంచి డిమాండ్ ఉండగా.. ఎట్టకేలకు తమన్ కంటెంట్ రిలీజ్ చేశాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది.
ముఖ్యంగా ఇంటర్వెల్లో చిన్న పాపను కాపాడేందుకు డాకు తన పాత అవతారాన్ని బయటికి తీసే ఎపిసోడ్.. అలాగే అడవిలో వచ్చే ఫైట్.. ఫ్లాష్ బ్యాక్‌లో విలన్ ఇంటికి వెళ్లి హీరో విశ్వరూపం చూపించే ఎపిసోడ్… ఈ సన్నివేశాల్లో తమన్ బీజీఎం ఇచ్చే ఊపు మామూలుగా ఉండదు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ సన్నివేశాల తాలూకు వీడియోలు పెట్టి అభిమానులు సెలబ్రేట్ చేశారు. ఇప్పుడు తమన్ అధికారికంగా రిలీజ్ చేసిన సౌండ్ ట్రాక్స్‌తో మరోసారి ‘డాకు మహారాజ్’ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తమన్ కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్స్ అంటూ నెటిజన్లు అతణ్ని కొనియాడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates