ఓటిటి రియాక్షన్లు ఎందుకు తగ్గుతున్నాయి

కరోనా వచ్చి వెళ్ళిపోయిన ఒకటి రెండు సంవత్సరాలు ఓటిటిలో వచ్చే కంటెంట్, కొత్త సినిమాల గురించి సోషల్ మీడియాలో డిబేట్లు కనిపించేవి. జనాల రియాక్షన్లు తెలుసుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడేవి. థియేటర్ లో బాగా ఆడినవి డిజిటల్ లో నెగటివ్ అయిన దాఖలాలు ఎన్నో. బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయినవి ఆన్ లైన్ చూసి మెచ్చుకున్న ఉదంతాలు ఎన్నో. అయితే గత కొంత కాలంగా జరుగుతున్న ట్రెండ్స్ గమనిస్తే ఓటిటి పట్ల ఆడియన్స్  స్పందన క్రమంగా తగ్గడం గమనించవచ్చు.

ఇటీవలే కేవలం నాలుగు వారాల వ్యవధిలో జైలర్ 2, రణబాలి వేర్వేరు ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చాయి. విచిత్రంగా వీటి గురించి పెద్దగా సౌండ్ లేదు. రజనీకాంత్ స్టయిల్ స్వాగ్ గురించి గత నెల పొగడ్తల వర్షం కురిపించిన వాళ్ళు అదే సినిమా బుల్లితెరపైకి వచ్చాక అంతగా రియాక్ట్ అవ్వడం లేదు. రణబాలి కేసు కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇంకా బాగా ఆడి ఉండాల్సిందని, దర్శకుడు రాహుల్ కొన్ని మార్పులు చేసి ఉంటే ఎక్కడికో వెళ్లేదనే అభిప్రాయం చాలా మంది వ్యక్తపరుస్తున్నారు.

మొన్నటికి మొన్న ప్యారడైజ్ వచ్చినప్పుడు ఎంత ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే. అది కూడా మరీ తీవ్రంగా కాదు. రాజా సాబ్ టైంలో మారుతీ మీద చూసినంత ఎటాకింగ్ శ్రీకాంత్ ఓదెల విషయంలో కొంచెం తగ్గింది. అంతే తప్ప పూర్తిగా క్షమించారని కాదు. ఇంకొంచెం వెనక్కు వెళ్తే సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన లెనిన్, మా ఇంటి బంగారం లాంటివి ఓటిటిలో జస్ట్ పాస్ అనిపించుకున్నాయి తప్ప వావ్ అనిపించుకోలేదు. పెద్ది కోసం రామ్ చరణ్ పడిన కష్టాన్ని ఓటిటి ఆడియన్స్ లైట్ తీసుకున్నారు.

భారీ వసూళ్లు సాధించిన మీర్జాపూర్ ఓటిటికి వచ్చిన తర్వాత చేసిన సౌండ్ తక్కువే. ఇదంతా విశ్లేషణ చేసుకుంటే క్రమంగా థియేటర్, ఓటిటి మధ్య ఉన్న సన్నని గీత మరింత పెద్దదవుతోందని చెప్పొచ్చు. ఇది మంచిదే. ఎందుకంటే ఎలాగూ ఓటిటిలో వస్తుందనే భావన జనంలో పెరిగితే థియేటర్ ఆక్యుపెన్సీలు తగ్గుతాయి. అలా కాకుండా ముందు బిగ్ స్క్రీన్ మీద చూసేద్దాం అనే ప్రేక్షకుల సంఖ్య పెరిగితే అవి టికెట్ల రూపంలో కలెక్షన్లుగా మారతాయి.నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కోరుకునేది ఇదే.