కొత్త వివాదాలు తెచ్చేలా ఉన్న ఓమ్

ఈ నెల నవంబర్ 20 విడుదల కాబోతున్న ఓమ్ మీద మూవీ లవర్స్ లో ప్రత్యేకమైన అంచనాలున్నాయి. పేరుకు తమిళ సినిమానే అయినా క్యాస్టింగ్ పరంగా మనకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉండటంతో ఏపీ, తెలంగాణలో ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి. అమరన్ లాంటి బ్లాక్ బస్టర్ తో అందరినీ తనవైపు తిప్పుకున్న దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి ఈ ఓమ్ డైరెక్టర్ కావడంతో బిజినెస్ పరంగానూ క్రేజ్ నెలకొంది. నిన్న ట్రైలర్ రిలీజ్ చేసి కథలో కొన్ని కీలకమైన ఎలిమెంట్స్ రివీల్ చేశారు.

ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. తమిళనాట నుంచి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ పళనివేల్ (ధనుష్) ఈ మాఫియాను పట్టుకునే పనిలో ఉండగా ఏపీ నుంచి వచ్చిన లేడీ పోలీస్ నిత్య రెడ్డి (సాయిపల్లవి) తన ప్రాణాన్ని సైతం రిస్కులో పెట్టి వీళ్ళను ఎదురుకుంటుంది. దీనంతటి వెనుక ఒక కింగ్ పిన్ బర్మా సియా (మమ్ముట్టి) ఉంటాడు. అనూహ్యంగా పళనివేల్ ఈ సియా గ్యాంగ్ లో అడుగు పెడతాడు. ఆ తర్వాత జరిగేది తెరమీద చూడాలి.

పదేళ్ల క్రితం శేషాచలం అడవుల్లో జరిగిన కూంబింగ్ ఆపరేషన్ ఆధారంగా ఈ స్టోరీ రాసుకున్నట్టు చెన్నై వర్గాలు ఉటంకిస్తున్నాయి. వాటిని రాజ్ కుమార్ ధృవీకరించడం లేదు కానీ విజువల్స్ చూస్తే మటుకు వాస్తవమే అనిపించేలా ఉన్నాయి. ఒకవేళ అదే నిజమైతే కొత్త వివాదాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే స్మగ్లింగ్ మూలాలు ఎక్కడ ఉన్నాయనేది ఇందులో చూపిస్తే అవతలి రాష్ట్రం నుంచి అభ్యంతరం వచ్చే అవకాశం లేకపోలేదు. సెన్సార్ ఏమంటుందో చూడాలి.

ఓమ్ రెండు భాగాలుగా రానుంది. ఇప్పుడు చూడబోయేది చాప్టర్ 1. అంటే మొత్తం కథ ఇప్పుడే చూపించడం లేదన్న మాట. ధనుష్, మమ్ముట్టితో పాటు సాయిపల్లవికి పెర్ఫార్మన్స్ చేయడానికి మంచి అవకాశం దొరికింది. గ్లామర్ పాత్రలకు భిన్నంగా శ్రీలీల అమాయక భార్య క్యారెక్టర్ దక్కించుకుంది. వ్యవస్థలో భాగమై అదే వ్యవస్థకు తిరగబడే పోలీస్ గా ధనుష్ మెయిన్ హైలైట్ అయ్యేలా ఉన్నాడు. సాయి అభ్యంక్కర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫ్రెష్ గా ఉంది. ఓమ్ అంటే ఇందులో సాయిపల్లవి చేపట్టిన మిషన్ పేరు.