‘రిపీట్’ హైప్ సరిపోతుందా బాసూ  

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో ఈ నగరానికి ఏమైంది రిపీట్ మీద బయ్యర్ వర్గాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. యూత్ కల్ట్ క్లాసిక్ గా భావించే మూవీకి కొనసాగింపు కావడంతో ఓపెనింగ్స్, టాక్ బాగా వచ్చి కలెక్షన్లు తెస్తుందనే నమ్మకం వాళ్ళలో కనిపిస్తోంది. దానికి తగ్గట్టే టీమ్ ప్రమోషన్లు చేస్తోంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇంటర్వ్యూల రూపంలో వీలైనంత కంటెంట్ పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సాధారణ జనంలో దీని మీద అంత హైప్ ఉందా అంటే ప్రస్తుతానికి భారీగా లేదనే చెప్పాలి.

ఎందుకంటే ఈ నగరానికి ఏమైంది మొదటిసారి వచ్చినప్పుడు అదేమీ బ్లాక్ బస్టర్ కాదు. విమర్శకులు మెచ్చుకున్నా కమర్షియల్ గా పెద్ద ఫలితం దక్కలేదు. పెళ్లి చూపులు తర్వాత తరుణ్ నుంచి ఆశించిన సినిమా ఇది కాదంటూ కామన్ ఆడియన్స్ అంతగా రిసీవ్ చేసుకోలేదు. కట్ చేస్తే తర్వాత దాని స్థాయి పెరిగింది. రీ రిలీజ్ లో వచ్చిన వసూళ్లు చూసి పార్ట్ 2కి డిమాండ్ పెరగడంతో తరుణ్ భాస్కర్ రంగంలోకి దిగి చకచకా ప్రాజెక్టు పూర్తి చేశారు. బడ్జెట్ పెరిగినా నిర్మాత సృజన్ రాజీ పడలేదు.

ఇంత చేసినా ఏదో మిస్సవుతున్న ఫీలింగ్ అయితే జనంలో ఉంది. విశ్వక్ సేన్ ట్రాక్ రికార్డు ఏమంత బాలేదు. వరస ఫ్లాపులు తన ఇమేజ్ మీద ప్రభావం చూపించిన మాట వాస్తవం. అందుకే తన పేరు మీద కన్నా ఈ నగరానికి బ్రాండ్ మీద బిజినెస్ జరుగుతోంది. మిగిలిన ఆర్టిస్టులు స్టార్లు కాదు కాబట్టి పూర్తిగా కంటెంట్ మీదే ఆధారపడాల్సి ఉంటుంది. ఫ్యామిలీస్ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకపోయే రిస్క్ అయితే ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ విషయంలో ఉంది.

ఇంకో పెద్ద ఛాలెంజ్ ఆకాశంలో ఒక తార రూపంలో పొంచి ఉన్న పోటీ. ఇప్పటికే దీని మీద మంచి బజ్ నెలకొంది. దుల్కర్ సల్మాన్ ఇమేజ్ తో పాటు స్వప్న సినిమా లాంటి అగ్ర సంస్థ నిర్మాణం కావడంతో ప్రమోషన్లు బాగా జరుగుతున్నాయి. అల్లు అర్జున్ గెస్టుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇండస్ట్రీలో ప్రీ టాక్ పాజిటివ్ గా ఉంది. ధనుష్ మమ్ముట్టి ఓమ్ కూడా బాగానే సౌండ్ చేసేలా ఉంది. మరి ఇంత రష్ లో ఈ నగరానికి ఏమైంది రిపీట్ ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి.