హిట్ మెషీన్‌గా పేరున్న అనిల్ రావిపూడి.. సంక్రాంతికి తన సినిమాను తీసుకొచ్చాడంటే అది బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. ఈ ఏడాది మన శంకర వరప్రసాద్ గారుతో రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన అనిల్.. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అంతకుముందు ఎఫ్-2 సినిమాతోనూ ఇలాంటి విజయమే అందుకున్నాడు. ఐతే ఎఫ్-2, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు నిర్మించింది దిల్ రాజు కాగా.. మన శంకర వరప్రసాద్ గారు షైన్ స్క్రీన్ బేనర్లో తెరకెక్కింది. వచ్చే సంక్రాంతికి రానున్న జనవరి 12 విడుదల కూడా ఆ బేనర్లోనే రూపొందుతోంది.
కానీ ఈ రెండేళ్లు మిస్సయినప్పటికీ.. 2028 సంక్రాంతికి మాత్రం అనిల్ రావిపూడితో కలిసి తానే వస్తానంటున్నాడు దిల్ రాజు. తమ కలయికలో కొత్త సినిమా వచ్చే ఏడాది మొదలై 2028సంక్రాంతికి రిలీజవుతుందని ఆయన స్పష్టం చేశాడు. ప్రస్తుతం అనిల్ జనవరి 12 విడుదల పనుల్లో బిజీగా ఉన్నాడని.. ఆ సినిమా రిలీజై సూపర్ హిట్ కొట్టాక తమ సినిమా పనులు మొదలుపెడతామని రాజు చెప్పాడు.
ఐతే ఈ సినిమా హీరో ఎవరు.. ఎలాంటి కథ అన్న దానిపై తనకూ స్పష్టత లేదని రాజు చెప్పాడు. అనిల్ ఇప్పటికే ఒక లైన్ అనుకుని ఉంటాడని, జనవరి 12 విడుదల సినిమా రిలీజ్ తర్వాత తామిద్దరం కూర్చుని ఒక క్లారిటీ తెచ్చుకుంటామని రాజు అన్నాడు. ఈ సినిమా బాలయ్యతో అట కదా అంటే ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదని రాజు స్పష్టం చేశాడు.
కాగా.. వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా రాజు ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు.. ఇందుకు పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు ఒక ప్రచారం నడుస్తోంది. బహుశా పవన్, అనిల్‌లనే కలిపి రాజు సినిమా తీస్తాడేమో అన్న చర్చ కూడా జరుగుతోంది. ఏదైనా 2027 జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశముంది.
ఇదిలా ఉండగా.. రవితేజ, శ్రీవిష్ణు కాంబినేషన్లో హాసిత్ గోలి రూపొందించబోయే వీరాధి వీరులు ఫిబ్రవరిలో సెట్స్ మీదికి వెళ్తుందని ఈ సందర్భంగా రాజు క్లారిటీ ఇచ్చారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ హీరోగా వేణు యల్దండి రూపొందిస్తున్న యల్లమ్మ వచ్చే మార్చి 5న రిలీజవుతుందని రాజు కన్పమ్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
