2027 సంక్రాంతి సీజన్‌కు ఇంకో రెండు నెలల సమయమే ఉంది. కానీ ఇప్పటికీ పండగ సినిమాల మీద పూర్తి స్పష్టత లేదు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా చివరి వరకు సస్పెన్సు తప్పేలా లేదు. ఎప్పటికప్పుడు కొత్త సినిమా పోటీలోకి వస్తూనే ఉంది. తాజాగా సంక్రాంతి రేసులోకి ఓ చిన్న సినిమా అడుగు పెట్టిందనే వార్త చక్కర్లు కొడుతుంది. అదే.. మ్యాడ్-3. స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ బేనర్ నుంచి వచ్చిన మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల వరుసలో మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
దీన్ని ‘మ్యాడ్ జూనియర్స్’ పేరుతో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ ఏడాది ఆరంభంలో సెట్స్ మీదికి వెళ్లిన ఈ చిత్రం.. సైలెంటుగా చిత్రీకరణ జరుపుకుంది. ఇప్పుడు షూటింగ్ చివరి దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టేస్తున్నారట. దీన్ని 2027 సంక్రాంతి బరిలో నిలుపుతున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి.
త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోందట. ‘మ్యాడ్’, ‘మ్యాడ్’ చిత్రాల దర్శకుడు కళ్యాణ్ శంకరే ఈ చిత్రాన్ని కూడా రూపొందిస్తున్నాడా.. లేక అతడి కథను ఇంకెవరైనా తీస్తున్నారా అన్నది స్పష్టత లేదు. ఎందుకంటే ‘మ్యాడ్-2’ తర్వాత కార్తితో సినిమా కమిట్మెంట్ ఉంది.
‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’లో నటించిన హీరోలు ముగ్గురు ‘మ్యాడ్-3’లో కనిపించరు. ఇందులో ‘కోర్టు’ ఫేమ్ హర్ష్ రోషన్, ‘లిటిల్ హార్ట్స్’ కుర్రాడు జై కృష్ణ ఇందులో లీడ్ రోెల్స్ చేస్తున్నారు. ‘మ్యాడ్’ గ్యాంగ్ బయటికి వెళ్లిపోయాక కాలేజీలోకి కొత్తగా వచ్చిన జూనియర్ కుర్రాళ్ల కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. వీళ్లు చేసే అల్లరి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది.
2027 సంక్రాంతికి ఆల్రెడీ చిరంజీవి-బాబీల ‘కాకా’, వెంకటేష్-అనిల్ రావిపూడిల ‘జనవరి 12 విడుదల’, శర్వానంద్-శ్రీను వైట్లల ‘జార్జి క్రిష్’, శ్రీవిష్ణు-రామ్ అబ్బరాజుల ‘ఫ్యామిలీ ప్యాక్’ షెడ్యూల్ అయి ఉన్నాయి. సాయిధరమ్ తేజ్ ‘సంబరాల యేటిగట్టు’, ప్రశాంత్ వర్మ ‘మహాకాళి’ కూడా వస్తే రావచ్చు. మరి ఇన్ని సినిమాలు పోటీలో ఉండగా.. ఇప్పుడు మళ్లీ ‘మ్యాడ్-3’ కూడా అంటే కష్టమే. థియేటర్లు ఎలా సర్దుబాటు చేస్తారో.. ఇంత పోటీలో ఎలా సర్వైవ్ అవుతుందో?
Gulte Telugu Telugu Political and Movie News Updates
